ఆధ్యాత్మిక వేత్త, యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానందను అమితంగా ఇష్టపడే వారిలో టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ ఒకరు. ఆయన కథను వెండితెర మీదకు తీసుకురావాలని సీనియర్ నటుడు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. వివేకానంద బోధనల ప్రభావం తనపై ఉందని.. అందుకే ఆయన జీవిత చరిత్రను సినిమా చేయాలనుకుంటున్నాని ఎన్నో సందర్భాల్లో చెప్పారు. వెంకీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ను నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ నీలకంఠ చేతిలో పెట్టారని, ఆయన కొన్నాళ్ళు స్క్రిప్టు మీద వర్క్ చేసి పక్కన పెట్టేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇదే విషయం మీద నీలకంఠ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.
వెంకటేశ్ తో స్వామి వివేకానంద సిరీస్ ప్లాన్ చేశామని, కానీ అది ఆగిపోయిందని దర్శకుడు నీలకంఠ వెల్లడించారు. వివేకానంద సిరీస్ చేయాలని వెంకీ చాలా ఆసక్తిగా ఉండేవారని, అప్పుడు టీవీ సిరీస్ గా తీయాలని అనుకున్నామని తెలిపారు. కథ మీద వర్క్ చేసి అన్నీ సిద్ధం చేసుకున్నాక, ఆ ప్రాజెక్ట్ టేకాఫ్ కాలేదని అన్నారు. ఆ తరువాత వెంకటేష్ తో 'ఈనాడు' సినిమాకు కలిసి పనిచేసే అవకాశం దక్కిందని నీలకంఠ చెప్పారు. అయితే వివేకానంద సిరీస్ కార్యరూపం దాల్చకపోవడానికి కారణాలేంటనేది దర్శకుడు వెల్లడించలేదు.
1994లో ప్రియాంక అనే తమిళ్ రీమేక్ మూవీతో డైరెక్టర్ గా పరిచయమైన నీలకంఠ.. 2002లో రెండో సినిమా 'షో' తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ చిత్రానికి రెండు జాతీయ అవార్డులు వచ్చాయి. ఆ తర్వాత భూమికతో చేసిన మిస్సమ్మ సినిమా సక్సెస్ అవ్వడమే కాదు, దర్శకుడికి నంది అవార్డ్ తెచ్చిపెట్టింది. అయితే 'సదా మీ సేవలో', 'నందనవనం 120KM', 'మిస్టర్ మేధావి' వంటి సినిమాలు ఆశించిన విజయాన్ని అందించలేదు. కమల్ హాసన్, వెంకటేశ్ కలసి నటించిన 'ఈనాడు' చిత్రానికి డైలాగ్ రైటర్ గా పని చేసిన నీలకంఠ.. 'విరోధి', 'చమ్మక్ చల్లో' సినిమాలలో ఫ్లాప్స్ అందుకున్నారు. ఇక 2014లో 'మాయ' అనే సైకలాజికల్ థ్రిల్లర్ తీసిన దర్శకుడు, ఈ తొమ్మిదేళ్లలో మరో చిత్రం తెరకెక్కించలేదు.
నిజానికి ఈ గ్యాప్ లో పలు స్క్రిప్ట్స్ మీద వర్క్ చేసినా, అవి ప్రారంభం కాలేదని నీలకంఠ తెలిపారు. 'మాయ' మూవీ తర్వాత బాలీవుడ్ ఫిలిం మేకర్ మహేష్ భట్ నుంచి ఆఫర్ వచ్చిందని, చివరి నిమిషంలో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందని చెప్పారు. రెండు సినిమాలు షూటింగ్ స్టేజ్ కు వచ్చి అనుకోని కారణాల వల్ల ఆగిపోయాయని, ఆ తర్వాత మలయాళం సినిమా చేశానని, అలా తెలుగులో 9 ఏళ్లు గ్యాప్ వచ్చేసిందన్నారు. అయితే ఇన్నేళ్లకు ఎట్టకేలకు 'సర్కిల్' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు.
సాయి రోనక్, బాబా భాస్కర్, అర్షిణ్ మెహతా, రిచా పనై , నైనా కీలక పాత్రల్లో నీలకంఠ తెరకెక్కించిన కొత్త సినిమా "సర్కిల్". ఆరా ప్రొడక్షన్స్ బ్యానర్ లో రూపొందిన ఈ థ్రిల్లర్ జూలై 7న విడుదల కానుంది. విధి అనే కాన్సెప్ట్ ఓ వందమందిని ఓ సర్కిల్లోకి తీసుకొచ్చి.. ఎలా వారి జీవితాలను అల్లకల్లోలం చేసిందనేది మెయిన్ థీమ్ గా ఈ సినిమా తీసినట్లు దర్శకుడు చెబుతున్నారు. ఇది రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ కాదని, ఎమోషనల్ థ్రిల్లర్ అని పేర్కొన్నారు.
Also Read: 'గరుడ చాప్టర్-1' ఫస్ట్ లుక్ పోస్టర్: ఇంటెన్స్ లుక్ తో ఆకట్టుకున్న సత్య దేవ్!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial