Music Shop Murthy OTT Release: ఈవారం థియేటర్లలో చిన్న సినిమాల సందడి చాలానే ఉంది. ఈ సందర్భంగా ఓటీటీలో కూడా పలు చిన్న బడ్జెట్ సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. అందులో ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ కూడా ఒకటి. చాందిని చౌదరీ లీడ్ రోల్‌లో నటించిన ఈ సినిమా.. థియేటర్లకు ఎక్కువగా ప్రేక్షకులకు రప్పించలేకపోయినా ఈ మూవీని చూసినవారు మాత్రం చాలావరకు పాజిటివ్ రివ్యూలే ఇచ్చారు. కలలు కనడానికి వయసుతో సంబంధం లేదు అనే సోషల్ మెసేజ్‌తో విడుదలయిన ఈ చిత్రం.. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. ఏ హడావిడి లేకుండా స్ట్రీమింగ్ ప్రారంభించుకుంది.


ఎక్కడ చూడొచ్చంటే.?


చాందిని చౌదరీతో పాటు అజయ్ ఘోష్ లీడ్ రోల్‌లో నటించిన ‘మ్యూజిక్ షాప్ మూర్తి’.. ప్రస్తుతం ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్‌కు అందుబాటులో ఉంది. శివ పాలడుగు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీకి థియేటర్లలో మిక్స్‌డ్ రెస్పాన్స్ లభించింది. హర్ష గారపాటి, రంగారావు గారపాటి కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. పవన్.. ‘మ్యూజిక్ షాప్ మూర్తి’కి సంగీతాన్ని అందించారు. చాందిని చౌదరీ, అజయ్ ఘోష్‌తో పాటు ఆమని, అమిత్ శర్మ, భానుచందర్, దయానంద్ రెడ్డి కూడా ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో కనిపించారు. ఓటీటీలోకి వచ్చిన తర్వాత మూవీకి మరింత రీచ్ పెరిగే అవకాశం ఉందని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు.






ఒకేరోజు రెండు సినిమాలు..


జూన్ 14న థియేటర్లలో విడుదలయ్యింది ‘మ్యూజిక్ షాప్ మూర్తి’. ఇక ఇందులో హీరోయిన్‌గా నటించిన చాందిని చౌదరీ లీడ్ రోల్ చేసిన మరో మూవీ ‘యేవమ్’ కూడా అదే రోజు విడుదలైంది. అలా తన సినిమాలో రెండూ ఒకేరోజు విడుదల అవ్వడంపై చాలా ఎమోషనల్‌గా మాట్లాడింది చాందిని. ఒకప్పుడు తను హీరోయిన్ అవ్వాలనుకుంటున్నానని చెప్తే.. ఎవరూ తనను నమ్మలేదని, నవ్వుకున్నారని ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బయటపెట్టింది. అలాంటి తను హీరోయిన్ అవ్వడం మాత్రమే కాకుండా తన రెండు సినిమాలు ఒకే రోజు విడుదల అవ్వడం గర్వంగా ఉందని తెలిపింది.


విలన్ రోల్స్‌తో గుర్తింపు..


ఇక ‘మ్యూజిక్ షాప్ మూర్తి’లో లీడ్ రోల్ చేసిన అజయ్ ఘోష్ సైతం ఈ సినిమా కంటెంట్‌పై చాలా నమ్మకం పెట్టుకున్నారు. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఓపెన్‌గా తన మొబైల్ నెంబర్‌ను చెప్పేసి సినిమా నచ్చకపోతే నేరుగా ఫోన్ చేసి తిట్టమన్నారు. అలా మూవీ టీమ్ అంతా ఈ సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌ చూపినా ఫలితం మరోలా వచ్చింది. అయితే సినిమా బాగుందని క్రిటిక్స్‌ చెప్పినా... చూసేందుకు జనం ఆసక్తి చూపలేదు. అందుకే ఓటీటీలో కచ్చితంగా దీన్ని ఆదరిస్తారని భావిస్తోంది చిత్ర బృందం.


ఇప్పటివరకు అజయ్ ఘోష్‌ను ఎక్కువగా విలన్ రోల్స్‌లోనే చూశారు ప్రేక్షకులు. దయ లేకుండా ప్రజలను చంపే క్యారెక్టర్లే ఆయనకు ఎక్కువగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. అలాంటిది ఒక్కసారిగా తన రూటు మార్చి మ్యూజిక్ షాప్ మూర్తి అనే పాత్రతో ప్రేక్షకులను ఎమోషనల్ చేసేశారు అజయ్ ఘోష్.



Also Read: ఓటీటీలో నవ్విస్తూ.. భయపెడుతోన్న ‘కకుడా’ - మూడు రోజుల్లోనే ఆ రికార్డ్ బ్రేక్ చేసిందిగా!