Ayyana Mane Web Series Telugu OTT Streaming: క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ అన్నా వెబ్ సిరీస్ అన్నా ఆ క్రేజ్ వేరేగా ఉంటుంది. ఓటీటీలు సైతం అలాంటి కంటెంట్‌నే ఎక్కువగా అందుబాటులో ఉంచుతున్నాయి. ఇప్పటికే కన్నడ, హిందీ, తమిళ భాషల్లో రిలీజై భారీ సక్సెస్ అందుకున్న లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ 'అయ్యనా మానే' వెబ్ సిరీస్ ఇప్పుడు తెలుగులోనూ స్ట్రీమింగ్‌కు రెడీ అవుతోంది.
ముగ్గురు కోడళ్ల రహస్య మరణాలు
ఖుషీ రవి, అక్షయ నాయక్, మానసి సుధీర్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ 'అయ్యనా మానే'. రమేష్ ఇందిర ఈ సిరీస్‌ను తెరకెక్కించగా.. కన్నడ, హిందీ, తమిళ భాషల్లో భారీ విజయం అందుకుంది. దీంతో తెలుగులోనూ ఈ సిరీస్ కావాలనే డిమాండ్లు వినిపించగా.. తాజాగా తెలుగులోనూ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతోంది. 'జీ5' కన్నడ ఒరిజినల్ సిరీస్‌గా విడుదలైన ఈ క్రైమ్ థ్రిల్లర్ విడుదలైన రోజు నుంచీ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఐఎండీబీలో 8.6 రేటింగ్స్ సాధించి రికార్డు సృష్టించింది.
ఈ గ్రిప్పింగ్ ఫ్యామిలీ థ్రిల్లర్ ఈ నెల 16 నుంచి 'జీ5' ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు సౌత్ ఇండియా మొత్తం 'అయ్యనా మానే' పరిధి మరింత విస్తృతం కానుందని ఓటీటీ సంస్థ తెలిపింది. సస్పెన్స్, థ్రిల్లర్, ఫ్యామిలీ అంశాలతో తెరకెక్కించిన ఈ సిరీస్ తెలుగు ఆడియన్స్‌ను సైతం ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు.
స్టోరీ ఏంటంటే?
చిక్ మంగళూర్ నేపథ్యంలో ఈ స్టోరీ సాగుతుంది. పేరు మోసిన ఓ గొప్ప ఇంట్లో ముగ్గురు కోడళ్ల రహస్య మరణాల చుట్టూ ఈ కథ రూపొందింది. తమ కుల దేవత కొండయ్య శాపం వల్లే ఈ మరణాలు సంభవించాయని కుటుంబ సభ్యులతో పాటు ఊరి వారు కూడా నమ్ముతుంటారు. ఇదే సమయంలో జాజీ (ఖుషీ రవి) ఆ ఇంటికి కోడలిగా వస్తుంది. ఆ శాపం వల్ల తనకు ప్రాణ హాని ఉందని తెలిసుకున్న జాజీ.. ఆ ఇంటి పని మనిషి తాయవ్వ, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ మహానేష్ మద్దతుతో దీని వెనుక అసలు రహస్యం ఏంటో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తుంది.
ఈ క్రమంలో ఆమె ఎదుర్కొన్న పరిణామాలేంటి? అసలు ఆ మరణాల వెనుక ఉన్నది కుల దేవత శాపమేనా? నిజంగానే ఆ కుటుంబానికి శాపం ఉందా? కోడళ్ల మరణాలకు కారణం ఏంటి? అనేది తెలియాలంటే సిరీస్ చూడాల్సిందే.
‘అయ్యనా మానే’లో భాగం కావడం ఆనందంగా ఉందని హీరోయిన్ ఖుషీ రవి అన్నారు. 'నా రోల్ సవాల్‌తో కూడుకుని ఉంటుంది. ఇలాంటి కన్నడ కథలను ప్రాముఖ్యతను కల్పించిన ZEE5, శ్రుతి నాయుడు ప్రొడక్షన్స్‌కి కృతజ్ఞతలు. ఆడియెన్స్ మా వెబ్ సిరీస్ మీద, నా పాత్ర మీద కురిపిస్తున్న ప్రేమను చూస్తే ఎంతో సంతోషంగా ఉంటోంది. ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు తెలుగులోకి రాబోతోంది. ఇది నాకు ఎంతో ఆనందం కలిగించే విషయం. ఇప్పుడు సౌత్ అంతటా కూడా మా సిరీస్ సత్తాను చాటుకుంటుంది’ అని అన్నారు.