JD Chakravarthy: దర్శకుడు పవన్ సాధినేని దర్శకత్వంలో జేడీ చక్రవర్తి ప్రధాన పాత్రలో వస్తోన్న వెబ్ సిరిస్ ‘దయా’. ఇటీవలే ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేయగా అది ప్రేక్షకులను ఆకట్టుకుంది. దీంతో ఈ వెబ్ సిరీస్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహించారు మేకర్స్. ఈ కార్యక్రమానికి జేడీ స్నేహితులు దర్శకుడు కృష్ణవంశీ, నటుడు ఉత్తేజ్ లు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా జేడీ చక్రవర్తి తన సినిమా కెరీర్ గురించి చెప్పుకొచ్చారు. అందులో భాగంగా దర్శకుడు కృష్ణవంశీ గురించి వారిద్దరి కెరీర్ లో చేసిన మొదటి సినిమా ‘గులాబీ’ గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు జేడీ. 


నేను ఈ స్థాయిలో ఉండటానికి కారణం కృష్ణవంశీ: జేడీ చక్రవర్తి


జేడీ చక్రవర్తి ‘దయా’ వెబ్ సిరీస్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సినిమా కెరీర్ లో తన మొదటి రోజుల్ని గుర్తు చేసుకుంటూ ‘గులాబీ’ సినిమా గురించి చెప్పుకొచ్చారు. ‘దయా’ వేదికపై ‘గులాబీ’ గురించి చెప్పడం సబబు కాదని అయినా ఈ సందర్భంగా ‘గులాబీ’ గురించి చెప్పాల్సిందేనన్నారు. ఎందుకంటే.. ఇప్పుడు పవన్ సాధినేనికు ఈ చాన్స్ రావడానికి కారణం ‘గులాబీ’ సినిమా అని, అది లేకపోతే తాను ఇక్కడ ఉండేవాడ్ని కాదని అన్నారు. సుమారు 25 ఏళ్ల తర్వాత మేమిద్దరం ఇలా ఒకే వేదికపై కలుసుకోవడం చాలా ఆనందంగా ఉందని, దర్శకుడు పవన్ వల్లే ఇది సాధ్యమైందని వ్యాఖ్యానించారు. తాను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కృష్ణ వంశీనే కారణమని అన్నారు. 


‘గులాబీ’ తీస్తే నాతోనే తీస్తానని చెప్పాడు: జేడీ


కృష్ణ వంశీను దర్శకుడిగా పరిచయం చేసేందుకు ‘గులాబీ’ కథతో హీరో రాజశేఖర్ దగ్గరకు తీసుకెళ్లానని, తీరా వెళ్లాక ‘గులాబీ’ కథ చెప్పకుండా వేరే కథ చెప్పాడని, మధ్యలో తాను కలుగజేసుకుంటే అప్పుడు మళ్లీ ‘గులాబీ’ కథ స్టార్ట్ చేశాడని అన్నారు. అయితే ఆ మూవీలో బ్రహ్మాజీ పాత్రను తనను చేయాలని, తన పాత్రను ఆయన చేస్తానని రాజశేఖర్ అనడంతో వంశీ వెంటనే లేచి అక్కడ నుంచి బయటకు వచ్చేశాడని అన్నారు. తర్వాత అలా ఎందుకు చేశావ్ అని అడిగితే ‘‘‘గులాబీ’ సినిమా తీస్తే అది జేడీతోనే తీస్తా’’ అని వంశీ చెప్పాడని, అలాగే తనతోనే ఆ సినిమాను తీశాడని అన్నారు. ‘గులాబీ’ సినిమాకు అన్నీ అలా కుదిరిపోయాయని చెప్పారు. 


పవన్ అద్భుతమైన దర్శకుడు: జేడీ


అనంతరం జేడీ ‘దయా’ వెబ్ సిరీస్ గురించి మాట్లాడుతూ.. దర్శకుడు పవన్ ‘దయా’ వెబ్ సిరీస్ ను చాలా చక్కగా తెరకెక్కించారని అన్నారు జేడీ. సిరీస్ షూటింగ్ ప్రారంభం అయిన కొద్ది రోజుల్లోనే పవన్ ప్రతిభ ఏంటో అర్థమైందన్నారు. షూటింగ్ పూర్తయ్యాక ఇది ఇండియాలోనే బెస్ట్ వెబ్ సిరీస్ లలో ఒకటిగా నిలుస్తుందని పేర్కొన్నారు. వాస్తవానికి దర్శకుడు పవన్ సాధినేని కృష్ణవంశీకు పెద్ద ఫ్యాన్ అని అందుకే తాము షూటింగ్ సమయంలో ఎక్కువగా ‘గులాబీ’ గురించి మాట్లాడుకునేవాళ్లమని అన్నారు. పవన్ ఒక అద్భుతమైన దర్శకుడని కితాబిచ్చారు. మర్డర్ మిస్టరీ నేపథ్యంలో సాగే ఈ వెబ్ సిరీస్ లో ఈషారెబ్బా, విష్ణుప్రియ, కమల్ కామరాజు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఆగస్టు 4 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార లో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. 


Also Read: ‘హరిహర వీరమల్లు’ అప్‌డేట్: ఆ ఫోటో షేర్ చేసి పవన్ ఫ్యాన్స్‌‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన నిధి అగర్వాల్!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial