3 Body Problem Web Series: పుస్తకాలపై ఆధారపడి ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లు తెరకెక్కడం కామన్. ఎక్కువశాతం పుస్తకాల వల్ల సినిమాలకు పాపులారిటీ లభిస్తుంది. కానీ సినిమాలు, సిరీస్‌లు వల్ల పుస్తకాలకు పాపులారిటీ లభించడం అనేది చాలా అరుదుగా జరుగుతుంది. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయిన ఒక వెబ్ సిరీస్ వల్ల అదే జరిగింది. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయిన ‘3 బాడీ ప్రాబ్లమ్’ అనే వెబ్ సిరీస్ వల్ల అమెజాన్‌లో రెండు పుస్తకాల అమ్మకం విపరీతంగా పెరిగిందని తెలుస్తోంది. దీంతో అసలు ఈ వెబ్ సిరీస్ చూడనివారు, పుస్తకాలు చదవని వారు ఇదంతా దేని గురించి అని సెర్చ్ చేయడం మొదలుపెట్టారు.
ఆ రెండు పుస్తకాలకు డిమాండ్..
తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో ‘3 బాడీ ప్రాబ్లమ్’ అనే ఒక వెబ్ సిరీస్ విడుదలయ్యింది. మామూలుగా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యే వెబ్ సిరీస్‌లకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అలాగే దీనికి కూడా లభించింది. ఇక ఈ సిరీస్ విషయానికొస్తే.. ఇది ‘రిమెంబ్రెన్స్ ఆఫ్ ఎర్త్స్ పాస్ట్’ అనే పుస్తకం ఆధారంగా తెరకెక్కింది. దీంతో ఈ పుస్తకానికి సేల్స్ అమాంతం పెరిగిపోయాయని మేకర్స్ అంటున్నారు. అంతే కాకుండా ‘3 బాడీ ప్రాబ్లమ్’ సిరీస్‌లో ‘సైలెంట్ స్ప్రింగ్’ అనే పుస్తకం గురించి కూడా పదేపదే ప్రస్తావన వచ్చింది. దీంతో దాని సేల్స్ కూడా ఆకాశాన్ని తాకాయని తెలుస్తోంది. వెబ్ సిరీస్‌ల వల్ల పుస్తకాలకు క్రేజ్ లభించింది కాబట్టి అదేంటో తెలుసుకోవాలని సిరీస్‌ను చూడాలని నిర్ణయించుకున్న ప్రేక్షకులు కూడా ఉన్నారు.
గ్రహంతరవాసులు, సైంటిస్టుల మధ్య కథ..
చైనీస్ రచయిత లియు సిక్సిన్ రచించిన సైఫై బుక్ సిరీసే ‘రిమెంబ్రెన్స్ ఆఫ్ ఎర్త్స్ పాస్ట్’. ఇందులో విశ్వంలోని ఎన్నో విషయాలను ఆయన ప్రశ్నించారు. ఈ పుస్తకాన్ని దాదాపుగా వెబ్ సిరీస్‌గా మార్చారు మేకర్స్. ఇక ‘3 బాడీ ప్రాబ్లమ్’ సిరీస్‌లో ట్రైసోలారిస్ అనే గ్రహాన్ని గ్రహంతరవాసులు ఆక్రమించుకుంటారు. ఆ సమయంలో అక్కడి మనుషులు ఏం చేశారు అనే అంశంపై సిరీస్ సాగుతుంది. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఫేమ్ డేవిడ్ బెనియోఫ్, డీబీ వెయిస్, అలెక్సాండర్ వూ కలిసి ‘3 బాడీ ప్రాబ్లమ్’ను తెరకెక్కించారు. గ్రహంతరవాసులు వచ్చి ఆ గ్రహాన్ని ఆక్రమించుకున్న తర్వాత శాస్త్రవేత్తలు ఏం చేశారు అనే విషయాన్ని ఈ సిరీస్‌లో స్పష్టంగా చూపించారు.
బెస్ట్ సెల్లర్..
ముందుగా లిల్లీస్ సిరీస్ మ్యానియాలో ‘3 బాడీ ప్రాబ్లమ్’ స్పెషల్ స్క్రీనింగ్ జరిగింది. కానీ ఆ స్క్రీనింగ్ తర్వాత ఈ సిరీస్‌కు మిక్స్‌డ్ రివ్యూలు లభించాయి. ఈ వెబ్ సిరీస్‌ను చాలా తెలివిగా తెరకెక్కించారని చాలామంది అభిప్రాయపడ్డారు. కాన్సెప్ట్ బాగున్నా కూడా కొంచెం అతిగా ఉందని కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ‘3 బాడీ ప్రాబ్లమ్’ అనే సిరీస్ ఇలా ఉంటే.. ‘రిమెంబ్రెన్స్ ఆఫ్ ఎర్త్స్ పాస్ట్’ పుస్తకం ఎలా ఉంటుందో అనే ఉద్దేశ్యంతో చాలామంది ప్రేక్షకులు.. అమెజాన్‌లో ఈ పుస్తకాన్ని కొనడానికి ముందుకొచ్చారు. దీంతో ప్రస్తుతం ఇది అమెజాన్‌లో బెస్ట్ సెల్లర్‌గా మారింది. ‘3 బాడీ ప్రాబ్లెమ్’లో కీలక పాత్ర అయిన యే వెంజీ అనే మహిళ.. ఎప్పుడూ ‘సైలెంట్ స్ప్రింగ్’ అనే పుస్తకాన్ని చదివి అసలు విశ్వం యొక్క ప్రయోజనాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అందుకే అమెజాన్‌లో ఈ బుక్ సేల్స్ కూడా విపరీతంగా పెరిగిపోయాయి.
Also Read: నిహారిక కొణిదెల కొత్త సినిమాకు క్రేజీ టైటిల్ - యూత్‌ను హైలైట్ చేస్తూ...