భారతీయ సినిమా ప్రేక్షకులకు, మరీ ముఖ్యంగా తెలుగు ప్రజలు అందరికీ ఇదొక గర్వకారణమైన సందర్భం. మరో చరిత్ర సృష్టించడానికి 'ఆర్ఆర్ఆర్' సినిమా రెండు అడుగుల దూరంలో నిలిచింది. ప్రపంచ సినిమా ప్రేక్షకులు అత్యున్నత పురస్కారంగా భావించే ఆస్కార్ అవార్డుకు 'ఆర్ఆర్ఆర్' సినిమాలోని 'నాటు నాటు...' పాట పోటీ పడుతోంది. షార్ట్ లిస్ట్ అయ్యింది. అసలు వివరాల్లోకి వెళితే... 


ఆ 15 పాటల్లో 'నాటు నాటు...' ఒకటి!
మొత్తం 81 పాటలతో పోటీ పడి మరీ...
ద అకాడమీ అవార్డ్స్ (అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ సైన్సెస్) మొత్తం 23 విభాగాల్లో అవార్డులు ఇస్తుంది. అందులో 10 విభాగాల్లో పోటీ పడుతున్న సినిమాల వివరాలను తాజాగా వెల్లడించింది. 


'బెస్ట్ ఒరిజినల్ సాంగ్' విభాగంలో పదిహేను పాటలను షార్ట్ లిస్ట్ చేసినట్లు ఆస్కార్ పేర్కొంది. మొత్తం 81 పాటలు ఈ విభాగంలో పోటీ పడటానికి అర్హత సాధించగా... అందులో 15 పాటలను సెలెక్ట్ చేశారు. ఆ పదిహేనులో 'ఆర్ఆర్ఆర్' ఒకటి. వీటిలో మళ్ళీ ఐదు పాటలు నామినేషన్స్‌కు వెళతాయి. ఆ తర్వాత ఐదింటిలో ఒకటి విన్నర్‌గా నిలుస్తుంది. విజేతగా నిలవడానికి 'ఆర్ఆర్ఆర్'లోని 'నాటు నాటు...' రెండు అడుగుల దూరంలో ఉంది.
 
జనవరి 24, 2023లో ఆస్కార్ నామినేషన్స్ వెల్లడిస్తారు. మార్చి 23, 2023న విజేతల వివరాలు వెల్లడిస్తారు. ఆస్కార్ అవార్డ్స్ ప్రోగ్రామ్ జరగనుంది.
 
ఆస్కార్స్‌లో ఇండియా నుంచి మరో మూడు
ఇండియా నుంచి 'చెల్లో షో' (ద లాస్ట్ ఫిల్మ్ షో) 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్' కేటగిరీలో షార్ట్ లిస్ట్ అయ్యింది. 'బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్' కేటగిరీలో 'ఆల్ ద బ్రీత్స్'... 'బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్' కేటగిరీలో 'ద ఎలిఫాంట్ విష్పర్స్' కూడా షార్ట్ లిస్ట్ అయ్యాయి. అవి కూడా ఇండియా నుంచి వెళ్ళినవే. 


Also Read : 'కనెక్ట్' రివ్యూ : 'కనెక్ట్' రివ్యూ : నయనతార సినిమా భయపెడుతుందా? బోర్ కొడుతుందా?


ఇప్పటి వరకు 'ఆర్ఆర్ఆర్'కు వచ్చిన అవార్డులు చూస్తే... లాస్ ఏంజెల్స్ క్రిటిక్స్ అవార్డుల్లో 'బెస్ట్ ఒరిజినల్ సాంగ్' అవార్డు ఎంఎం కీరవాణికి దక్కింది. ఇక ఉత్తమ దర్శకుడి విభాగంలో ఎస్.ఎస్.రాజమౌళి రన్నరప్‌గా నిలిచారు. ఈ ఏడాది 'ఆర్ఆర్ఆర్'కు గాను ఉత్తమ దర్శకుడిగా రాజమౌళికి న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు ఇచ్చింది. సన్‌సెట్ సర్కిల్ అవార్డుల్లో దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఉత్తమ దర్శకుడి విభాగంలో రన్నరప్‌గా నిలిచారు.


బోస్టన్ సొసైటీ నుంచి కూడా కీరవాణికి ఒక అవార్డు వచ్చింది. అంతకు ముందు హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ నుంచి కూడా 'ఆర్ఆర్ఆర్' అవార్డు అందుకుంది. 'ఆర్ఆర్ఆర్' కాస్ట్ అండ్ క్రూ (నటీనటులు, సాంకేతిక నిపుణులు) కు స్పాట్ లైట్ విన్నర్ అవార్డు వచ్చింది. ఆల్రెడీ 'బెస్ట్ ఇంటర్నేషనల్ పిక్చర్'గా అవార్డులు అందుకున్న 'ఆర్ఆర్ఆర్'కు, అట్లాంటా ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ కూడా అదే విభాగంలో అవార్డు ఇచ్చింది. దీంతో ఆ అవార్డుల సంఖ్య మూడుకు చేరింది.


ఇంతకు ముందు... సన్‌సెట్ సర్కిల్ అవార్డుల్లో నాలుగు హాలీవుడ్ సినిమాలతో పోటీ పడి మరీ 'ఉత్తమ అంతర్జాతీయ సినిమా' విభాగంలో 'ఆర్ఆర్ఆర్' విజేతగా నిలిచింది. శాటన్ పురస్కారాల్లో 'ఆర్ఆర్ఆర్'కు 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్' అవార్డు వచ్చిన విషయం తెలిసిందే.


ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవగణ్, శ్రియా కీలక పాత్రలు పోషించగా... అలీసన్ డూడీ, రే స్టీవెన్ సన్ విలన్ రోల్స్ చేశారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. డీవీవీ మూవీస్ పతాకంపై డీవీవీ దానయ్య సినిమా నిర్మించారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.