స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన 'పుష్ప' సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటిరోజు నుంచి ఈ సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది. చాలా మందికి ఈ సినిమా కనెక్ట్ అయినప్పటికీ.. ఓ వర్గం ఆడియన్స్ కి మాత్రం సినిమా పెద్దగా నచ్చలేదు. కొంతమంది క్రిటిక్స్ కూడా ఈ సినిమాకి నెగెటివ్ రివ్యూలు ఇచ్చారు. దీంతో రివ్యూలను పట్టించుకోకుండా తమ సినిమా చూడాలని నిర్మాతలు ప్రేక్షకులను కోరారు.
అలానే ఇండస్ట్రీలో కొందరు హీరోలు, టెక్నీషియన్స్ కూడా రివ్యూలతో సంబంధం లేకుండా 'పుష్ప' సినిమా చూడాలని సోషల్ మీడియాలో వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. తాజాగా 'అర్జున్ రెడ్డి' ఫేమ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కూడా ఇలానే ఓ పోస్ట్ పెట్టారు. ముందుగా 'పుష్ప' సినిమాను మెచ్చుకుంటూ వరుసగా ట్వీట్స్ వేశారు సందీప్ రెడ్డి. 'పుష్ప' సినిమా ప్రతి ఒక్కరూ చూడాలని.. అల్లు అర్జున్ పెర్ఫార్మన్స్ కి స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వాలని అన్నారు. సినీ చరిత్రలోనే బెస్ట్ పెర్ఫార్మన్స్ లలో ఒకటిగా అల్లు అర్జున్ పోషించిన పాత్ర నిలిచిపోతుందని అన్నారు.
నోట్ అంటూ.. ఓ లైన్ రాసుకొచ్చారు సందీప్ రెడ్డి. అదేంటంటే.. ఈ సినిమాకి రేటింగ్స్ ఇచ్చే హక్కు ఫిలిం మేకర్స్ కి మాత్రమే ఉందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా సినిమాకి వందకు వంద మార్కులేశారు సందీప్ రెడ్డి. 'పుష్ప' సినిమాకి వస్తోన్న నెగెటివ్ రివ్యూలపై తనదైన స్టైల్ లో స్పందించారు సందీప్ రెడ్డి. మరోపక్క ఈ సినిమాను అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తుంది చిత్రబృందం. ఇంటర్వ్యూలు, ప్రెస్ మీట్ లు అంటూ హడావిడి చేస్తోంది. ఇప్పుడు గ్రాండ్ గా సక్సెస్ మీట్ ను ప్లాన్ చేస్తోంది.