టాలీవుడ్ లో ఉన్న మిడ్ రేంజ్ హీరోల్లో శర్వానంద్ కి మంచి క్రేజ్ ఉంది. ఆయన నటించే సినిమాలన్నీ మినిమం గ్యారెంటీ హిట్స్ గా ఉండేవి. అయితే ఈ మధ్యకాలంలో శర్వానంద్ కి సరైన హిట్టు పడలేదు. దిల్ రాజు నిర్మాణంలో సతీష్ వేగ్నేశ రూపొందించిన 'శతమానం భవతి' సినిమాతో భారీ విజయం అందుకున్న శర్వా.. ఆ సక్సెస్ ను నిలబెట్టుకోవడంలో విఫలమవుతున్నారు. 'పడి పడి లేచే మనసు', 'శ్రీకారం', 'జాను', 'రణరంగం', 'మహాసముద్రం', 'ఆడవాళ్లు మీకు జోహార్లు' ఇలా వరుసగా ప్లాప్ సినిమాల్లో నటించారు.
ప్రస్తుతం ఆయన నటించిన సినిమా 'ఒకే ఒక జీవితం' విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాతో శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. డ్రీమ్ వారియర్ పిక్చర్స్(Dream Warrior Pictures) బ్యానర్ మీద ఎస్ఆర్ ప్రభు, ఎస్ ఆర్ ప్రకాష్ బాబు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి తరుణ్ భాస్కర్ డైలాగ్స్ రాశారు. ఈ సినిమాలో శర్వానంద్ తల్లి పాత్రలో అమల అక్కినేని కనిపించనున్నారు. సెప్టెంబర్ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు.
ట్రైలర్ అయితే ప్రామిసింగ్ గానే ఉంది. కానీ ఈ సినిమాకి సరైన బజ్ రావడం లేదు. దీంతో ఇప్పుడు ప్రమోషన్స్ గట్టిగా చేయాలని భావిస్తున్నారు శర్వానంద్. ఈ సినిమాను తన స్నేహితులైన ప్రభాస్, రామ్ చరణ్, రానాల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించబోతున్నారట. వాళ్ల ఫీడ్ బ్యాక్ తీసుకొని.. ఈ సినిమా ప్రమోషన్స్ లో తన స్నేహితులను వాడుకోవాలని చూస్తున్నారు. ఇప్పటికే శర్వానంద్ తన బాల్య స్నేహితులు కొంతమందికి సినిమాను చూపించారు.
వాళ్లందరి నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చిందట. ఇప్పుడు ఇండస్ట్రీ ఫ్రెండ్స్ కోసం స్పెషల్ షో వేయబోతున్నారు. సెప్టెంబర్ 6, 7,8 తేదీల్లో 'ఒకే ఒక జీవితం' స్పెషల్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ తో పాటు మిగిలిన మెయిన్ సిటీస్ లో ఈ సినిమాను ప్రత్యేకంగా ప్రదర్శించబోతున్నారని సమాచారం. అయితే ఈ వారంలోనే 'బ్రహ్మాస్త' సినిమా రిలీజ్ కానుంది. ఇది భారీ బడ్జెట్ సినిమా. తెలుగులో కూడా మంచి బజ్ క్రియేట్ అయింది. ఈ సినిమాతో శర్వానంద్ పోటీ పడడం విశేషం.
'ఒకే ఒక జీవితం' సినిమా సైన్స్ ఫిక్షన్ జోనర్ లో తెరకెక్కుతోంది. దీనిపైనే శర్వానంద్ ఆశలన్నీ పెట్టుకున్నారు. మరి ఈ సినిమాతోనైనా ఆయన ప్లాప్ స్ట్రీక్ కి ఎండ్ కార్డ్ పడుతుందేమో చూడాలి. లేదంటే మాత్రం ఆయన కెరీర్ ఇబ్బందుల్లో పడడం ఖాయం. ఈ సినిమాకి జేక్స్ బిజోయ్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు. డియర్ కామ్రేడ్ సినిమాకు పని చేసిన సినిమాటోగ్రఫర్ అండ్ ఎడిటర్ సుజీత్ సారంగ్, శ్రీజిత్ సారంగ్‌లు ఈ సినిమాకి పని చేస్తున్నారు. తెలుగు తమిళ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించారు.