యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న లేటెస్ట్ సినిమా 'డీజే టిల్లు'. 'అట్లుంటది మనతోని' అనేది సినిమా ట్యాగ్ లైన్. నేహా శెట్టి  హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను విమల్ కృష్ణ డైరెక్ట్ చేశారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని భావించారు. 


కానీ కొన్ని కారణాల వలన సినిమా వాయిదా పడింది. తాజాగా ఫిబ్రవరి 12న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. రీసెంట్‌గా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ యూత్‌ను బాగా ఆకట్టుకుంది. హీరో హీరోయిన్స్ మధ్య సీన్స్ హైలైట్ గా నిలిచాయి. కాసర్ల శ్యామ్ రాసిన 'డీజే టిల్లు' టైటిల్ సాంగ్‌ను కొన్ని రోజుల క్రితం విడుదల చేశారు. రామ్ మిరియాల సంగీతం అందించడంతో పాటు స్వయంగా పాడిన ఆ సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఆలపించిన 'రాజా రాజా..' పాట కూడా యూట్యూబ్ లో ట్రెండ్ అయింది. దీంతో సినిమాపై మంచి బజ్ ఏర్పడింది. తాజాగా ఈ సినిమా నుంచి 'నువ్వలా..' అనే వీడియో సాంగ్ ను విడుదల చేశారు. 


ఈ పాటను హీరో సిద్ధు జొన్నలగడ్డ పాడడం విశేషం. అనుభవం ఉన్న గాయకుడి మాదిరి సిద్ధు ఈ పాటను పాడారు. రవికాంత్ పేరేపు ఈ పాటకు లిరిక్స్ అందించగా.. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలో ప్రిన్స్, ప్రగతి, నర్రా శ్రీనివాస్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.