ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని రోజులుగా భారీ వర్షాల కారణంగా ప్రజలు నానాఇబ్బందులు పడుతున్నారు. తుఫాన్ కారణంగా లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వరద ధాటికి ముఖ్యంగా దక్షిణాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు బాగా ఎఫెక్ట్ అయ్యాయి. కడప, కర్నూలు, నెల్లూరు, అనంతపురం జిల్లాల్లో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ నష్టం జరిగింది. కొన్ని వేల కోట్ల నష్టం జరిగిందని ప్రభుత్వం తెలిపింది. దీంతో ఏపీ జనాలను ఆదుకోవడానికి కొందరు ప్రముఖులు ముందుకు వస్తున్నారు. 

 

ఇప్పటికే ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తన బ్యానర్ గీతాఆర్ట్స్ తరఫున తిరుపతి వరద బాధితులకు రూ.10 లక్షల సాయం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కి డబ్బుని డొనేట్ చేశారు. తాజాగా ఎన్టీఆర్ కూడా తనవంతు సాయంగా పాతిక లక్షలు డొనేట్ చేశారు. 

 

''ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల సంభవించిన వరదల కారణంగా.. ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారు. అది నన్ను ఎంతగానో బాధించింది. అలాంటి పరిస్థితుల నుంచి వారు త్వరగా కోలుకోవడానికి.. నా వంతు సాయంగా రూ.25 లక్షలను డొనేట్ చేస్తున్నట్లు'' యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రకటించారు. 

 

ఈ ట్వీట్ చూసిన నెటిజన్లు ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రెజంట్ సీఎం పట్టించుకోకపోయినా.. ఫ్యూచర్ సీఎం రెస్పాండ్ అయ్యారంటూ ఎన్టీఆర్ పై తమ ప్రేమను వ్యక్తపరుస్తున్నారు. వరదల కారణంగా నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి ముందుకు రావడం ప్రశంసనీయమంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.