పాత తరం నటీనటులను గౌరవించడంలో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ఎప్పుడూ ముందుంటారు. పెద్దలకు ఆయన ఎంతో మర్యాద ఇస్తారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల (NTR Centenary Celebrations) సాక్షిగా మరోసారి బాలకృష్ణ పెద్దలకు ఇచ్చే మర్యాద ప్రేక్షకులకు తెలిసి వచ్చింది. సీనియర్ నటి ఎల్. విజయలక్ష్మి పాదాలకు ఆయన గౌరవంగా నమస్కరించారు. ఆ ఫోటో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది.
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా సీనియర్ నటి ఎల్. విజయలక్ష్మి (L Vijayalakshmi) కి శకపురుషుడి శతాబ్డి పురస్కారాన్ని ఆదివారం తెనాలిలో అందజేశారు. ఆమెను సోమవారం హైదరాబాద్‌లో బాలకృష్ణ వ్యక్తిగతంగా కలిశారు. సినీ ప్రముఖులు సమక్షంలో ఆమెకు గౌరవ సత్కారం చేశారు.
'సిపాయి కూతురు'తో ఎల్. విజయలక్ష్మి బాలనటిగా తెలుగు చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత 'జగదేకవీరుని కథ', 'ఆరాధన', 'గుండమ్మ కథ', 'నర్తనశాల', 'పూజా ఫలం', 'బొబ్బిలి యుద్ధం', 'రాముడు - భీముడు', 'భక్త ప్రహ్లాద' వంటి సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్‌తో పలు చిత్రాలు చేశారు.
''ఎల్. విజయలక్ష్మిగారికి శిరస్సు వచ్చి వందనాలు సమర్పిస్తున్నాను. సినిమాల్లో నటించడమే కాక... రాజకీయ, ప్రజా సేవ రంగాల్లో సేవలు చేసిన వ్యక్తులను సత్కరించుకొనే మహత్కర కార్యక్రమం ఇది. విజయలక్ష్మి గారు వందకు పైగా సినిమాల్లో నటిస్తే అందులో 60కి పైగా నాన్నగారితో నటించారు. ఆమె కూచిపూడి, భరతనాట్యం, కథాకళి, జావలి వంటి ఎన్నో నాట్యాలు ప్రదర్శించారు. సినిమా ప్రయాణం ఆపేశాక... నాన్నగారిని స్పూర్తిగా తీసుకుని అమెరికా వెళ్ళి సి.ఎ. చదివారు. వర్జీనియా యూనిర్శిటీలో బడ్జెట్ మేనేజర్‌గా ఉన్నారు. మహిళా సాధికారికతకు అనే ప్రతీక'' అని బాలకృష్ణ అన్నారు.
పురస్కార గ్రహీత ఎల్. విజయలక్ష్మి మాట్లాడుతూ ''నేను చిన్నతనం నుంచి రామారావుగారిని ఆదర్శంగా తీసుకున్నా. ఆయనతో నటించేటప్పుడు తొలుత చాలా భయపడ్డా. ఆయనలో మాత్రం తానొక పెద్ద హీరో అనే భావన ఎప్పుడూ ఉండేది కాదు. ఎన్టీఆర్ గారి నుంచి చాలా విలువలు నేర్చుకున్నాను. క్రమశిక్షణ, మాటతీరు, సిన్సియారిటీ, అంకిత భావం, నిబద్ధత వంటి విషయాలు గ్రహించా. ఎన్టీఆర్ స్ఫూర్తితో నేను చదువు కొనసాగించా'' అని అన్నారు.
''నాన్నగారు 1964లో నిర్మించిన 'రాముడు భీముడు'లో విజయలక్ష్మి గారు నటించారు. అందులోని ఓ పాటను నాగార్జున సాగర్‌లో తీశారు. అప్పుడు ఆవిడ ఎంత కష్టపడ్డారో నాన్నగారు చెబుతుండేవారు. నటిగా 10 ఏళ్ళలో 100 సినిమాలు చేయడం పెద్ద గౌరవం. ఇప్పుడు విదేశాల్లోని యూనివర్శిటీలో బాధ్యతలు నిర్వహించడం చాలా విశేషం'' అని సురేష్ బాబు అన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ... ''నాన్నగారు నిర్మించిన 'జమిందార్'లో విజయలక్ష్మి గారు నటించారు. ఇప్పుడు మాటల్లో 'ఆ చిత్రానికి డి. మధుసూదనరావు గారు దర్శకుడు కదా' అన్నారు. ఆవిడకు అన్నీ గుర్తుకు వున్నాయి. ఎన్టీఆర్ పురస్కారం ఆమెకు రావడం ముదావహం'' అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైవిఎస్ చౌదరి, పరుచూరి గోపాలకృష్ణ, కాజ సూర్యనారాయణ, ప్రసన్నకుమార్, బసిరెడ్డి, రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Also Read : హీరోయిన్ రంభ కారుకు యాక్సిడెంట్ - స్కూల్ నుంచి పిల్లలతో వస్తుండగా...