తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ ప్రత్యేకమైన సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు నట విఖ్యాత నందమూరి తారక రామారావు. అంతేకాదు తెలుగు జాతి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన రాజకీయ దురంధరుడు. అందుకే తెలుగు వారు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా ఆయన పేరు తలవకమానరు. అలాంటి గొప్ప నటుడు, రాజకీయ నాయకుడికి ఇప్పుడు మరో అరుదైన గౌరవం దక్కనుంది. మొట్టమొదటి సారిగా అమెరికాలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది NASAA (నార్త్ అమెరికన్ సీమ ఆంధ్రా అసోసియేషన్). ఆ మహానటుడి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు కోసం న్యూజెర్సీలోని ఎడిసన్ సిటీలో భూమిని కేటాయించడానికి ఆ సిటీ మేయర్ అనుమతినిచ్చినట్లు నార్త్ అమెరికా సీమ ఆంధ్రా అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఇటీవల ఎడిసన్ నగర మేయర్ సామ్ జోషి ఈ విగ్రహ ఏర్పాటు ప్రతిపాదనను సమీక్షించిన తరువాత విగ్రహ ఏర్పాటుకు సరైన స్థలాన్ని వెతకాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ విగ్రహ ఏర్పాటు కోసం తెలుగు సినీ నిర్మాత టి.జె. విశ్వప్రసాద్ ప్రత్యేక చొరవతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు సమాచారం. న్యూజెర్సీలో ఉన్న మెజారిటీ తెలుగు వారు ఈ కార్యక్రమానికి తమ పూర్తి మద్దతు తెలిపినట్లు తెలిపింది నాసా.
కాగా యునైటెడ్ స్టేట్స్ లో పబ్లిక్ ప్లేస్ లో ఏర్పాటు చేయబోయే ఎన్టీఆర్ మొదటి విగ్రహం ఇదే కావడం విశేషం. ఇప్పటికే ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభం అయ్యాయి. ఓ ప్రత్యేక బృందం ఈ కార్యక్రమం కోసం కృషి చేస్తున్నట్లు సమాచారం. ఈ విగ్రహ ఏర్పాటు కోసం నార్త్ అమెరికన్ సీమ ఆంధ్రా అసోసియేషన్ నిధులు సమకూరుస్తుంది. ఎడిసన్ నగరంలో నివాసితులు సహా యునైటెడ్ స్టేట్స్ లోని అనేక మంది నివాసితులు ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చారు. ఈ విగ్రహ ఏర్పాటు ద్వారా తెలుగు వారి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నం చేస్తున్నామని నాసా ప్రకటించింది. దీంతో అమెరికాలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుపై తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఆంధ్ర ప్రదేశ్ లో మహా నటుడి శతజయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మే 28, 2022న ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈ ఉత్సవాలు 28 మే 2023 వరకూ జరగనున్నాయి. నిమ్మకూరులో ఈ ఉత్సవాలు మొదలయ్యాయి. ఆ తరవాత తెనాలి లోని పెమ్మసాని (రామకృష్ణ) థియేటర్ లో ఎన్టీఆర్ సినిమాల ప్రదర్శన, పురస్కారాల ప్రదానోత్సవాలను ప్రారంభించారు. ఈ ఉత్సవాలు యేడాది పాటు జరుగుతాయి. ఇందులో వారానికి 5 సినిమాల ప్రదర్శన జరుగుతుంది. అలాగే వారానికి రెండు సదస్సులు, నెలకు రెండు పురస్కారాలు జరగుతున్నాయి. దీనిపై ఇప్పటికే నందమూరి బాలకృష్ణ ఒక ప్రణాళిక ప్రకటించారు. ఏడాది పాటు జరిగే కార్యక్రమాల్లో తమ కుటుంబం నుంచి నెలకి ఒకరు చొప్పున పాల్గొంటామని బాలకృష్ణ ఆనాడే ప్రకటించారు.