నందమూరి కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమాను ప్రకటించారు. ఈ సినిమాకు ఇంకా టైటిల్‌ను నిర్ణయించలేదు. కళ్యాణ్‌రామ్ కెరీర్‌లో ఇది 21వ సినిమా. కాబట్టి #NKR21 పేరుతో అనౌన్స్ చేశారు. 2014లో ‘అలా ఎలా’ వంటి సూపర్ హిట్ సినిమాను నిర్మించిన అశోక్ వర్థన్ ముప్పా, సునీల్ బలుసు లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ నిర్మాణ రంగంలోకి వస్తున్నారు. కళ్యాణ్‌ రామ్‌ సొంత బ్యానర్ నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌తో కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


కళ్యాణ్‌రామ్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. భారీ తారాగణం, టాలెంటెడ్ టెక్నికల్ టీమ్‌ #NKR21 కోసం పని చేయనున్నారు. టెక్నికల్‌గా చాలా హై స్టాండర్డ్స్‌లో ఈ సినిమా ఉండనుంది.


ఈ సినిమా ఒక పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్ అని నిర్మాతలు ప్రకటించారు. దీనికి తగ్గట్లే మాస్ అప్పీలింగ్ ఉన్న పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్‌లో రక్తంతో తడిసిన కళ్యాణ్ రామ్ చేతిని చూడవచ్చు. కళ్యాణ్ రామ్‌ను మునుపెన్నడూ చూడని యాక్షన్ అవతార్‌లో చూడవచ్చని, ప్రదీప్ చిలుకూరి చాలా మంచి కథ రాశారని నిర్మాతలు పేర్కొన్నారు. ‘డెవిల్’ తర్వాత కళ్యాణ్ రామ్ నటించనున్న సినిమా ఇదే. ఈ సినిమాకు స్క్రీన్‌ప్లేను హరి కృష్ణ బండారి అందించారు. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియనున్నాయి.


కళ్యాణ్ రామ్ పుట్టినరోజు సందర్భంగా ‘డెవిల్’ మూవీ గ్లింప్స్‌ను రిలీజ్ చేశారు. ఈ మూవీకు నవీన్ మేడారం దర్శకత్వం వహిస్తున్నారు. ‘డెవిల్’లో కళ్యాణ్ రామ్‌ సరసన సంయుక్త మీనన్ నటిస్తున్నారు. వీరు ఇప్పటికే ‘బింబిసార’లో జోడిగా కనిపించారు. 


‘డెవిల్’ సినిమా బ్రిటీష్ కాలంలో సాగే కథ. ఇందులో కళ్యాణ్ రామ్ బ్రిటిష్ కాలంలో ఉండే ఒక సీక్రెట్ ఏజెంట్. తాజాగా విడుదల అయిన గ్లింప్స్ తో మూవీపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ గ్లింప్స్ లో కళ్యాణ్ రామ్ సీరియస్ లుక్ లో కనిపిస్తున్నారు. కళ్యాణ్ రామ్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ పర్ఫెక్ట్ గా ఉన్నాయి. ‘మనసులో ఉన్న భావన ముఖంలో తెలియకూడదు, మెదడులో ఉన్న ఆలోచన మాటల్లో బయటపడకూడదు. అదే గూఢచారికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం’ అని కళ్యాణ్ రామ్ చెప్పే డైలాగ్ లు ఆకట్టుకున్నాయి. సినిమాలో విజువల్స్ చాలా గ్రాండ్‌గా ఉన్నాయి. పర్ఫెక్ట్ పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో కనిపిస్తున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా ఆకట్టుకుంటుంది.


ఈ మూవీను ప్రముఖ నిర్మాత అభిషేర్ నామా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్‌లో ఈ సినిమా విడుదల కానుంది. త్వ‌ర‌లోనే షూటింగ్ కంప్లీట్ చేసి వీలైనంత త్వరగా ప్రేక్ష‌కుల ముందుకు మూవీను తీసుకొచ్చేందుకు చిత్ర బృందం పనిచేస్తుంది.