యువ కథానాయకుడు కార్తికేయ గుమ్మకొండ (Kartikeya Gummakonda) సినిమాల్లో కథానాయికలకు చాలా ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఉంటాయి. 'ఆర్ఎక్స్ 100'లో ఇందుగా పాయల్ రాజ్‌పుత్... 'గుణ 369'లో గీతగా అనఘా... 'చావు కబురు చల్లగా' చిత్రంలో మల్లికగా లావణ్యా త్రిపాఠి... కథతో పాటు ప్రయాణించే, కథలో కీలకమైన క్యారెక్టర్లు చేశారు. ఇప్పుడు 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి (Neha Shetty)కి కూడా అటువంటి అవకాశమే లభించినట్టు ఉంది.   కార్తికేయ గుమ్మకొండ (Kartikeya Gummakonda) కథానాయకుడిగా రూపొందుతోన్న తాజా సినిమా 'బెదురులంక 2012'. ఇందులో నేహా శెట్టి కథానాయిక. సోమవారం ఆమె పుట్టినరోజు (Neha Shetty Birthday). ఈ సందర్భంగా సినిమాలో ఫస్ట్ లుక్ విడుదల చేశారు. 

'చిత్ర'గా నేహా శెట్టిNeha Shetty Role In Bedurulanka 2012 Movie : తమ సినిమాలో 'చిత్ర' పాత్రలో నేహా శెట్టి కనిపించనున్నట్లు 'బెదురులంక 2012' చిత్ర బృందం పేర్కొంది. ఆమెది  అభినయానికి ఆస్కారమున్న పాత్ర అని తెలియజేసింది. చిత్ర దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ "చాలా సంప్రదాయబద్ధంగా కనిపించే మోడ్రన్ అమ్మాయి చిత్ర. పైకి బార్బీ బొమ్మలా కనిపిస్తుంది కానీ... లోపల ఆర్డీఎక్స్ బాంబ్ లాంటి మనస్తత్వం ఆమెది'' అని చెప్పారు. అందంగా కనిపిస్తూ, అభినయంతో నేహా శెట్టి ఆకట్టుకుంటారని... కార్తికేయతో ఆమె నటించిన సన్నివేశాలు చాలా బావుంటాయని ఆయన పేర్కొన్నారు. 

క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సి. యువరాజ్ సమర్పణలో లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై బెన్నీ (రవీంద్ర బెనర్జీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. ఆయన నిర్మాణ సంస్థలో మూడో చిత్రమిది. డ్రామెడీ (డ్రామా ప్లస్ కామెడీ) జానర్‌లో రూపొందుతోంది.

Also Read : ఫుల్లు కొట్టినా కిక్ ఎక్కట్లేదు, అమ్మాయి హ్యాండ్ ఇస్తే? - కొత్త బ్రేకప్ సాంగ్ వచ్చేసింది అబ్బాయిలూ!

పల్లెటూరిలో యుగాంతం... కథ ఏంటంటే?Bedurulanka 2012 Movie Story : ఒక పల్లెటూరిలో 2012 యుగాంతం నేపథ్యంలో జరిగే కథతో 'బెదురులంక 2012' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని చిత్ర నిర్మాత బెన్నీ ముప్పానేని చెప్పారు. సినిమా చిత్రీకరణ దాదాపు పూర్తి అయ్యిందని, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఆయన తెలిపారు. కొత్త ఏడాదిలో సినిమా విడుదల చేస్తామన్నారు. అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమిది. డ్రామా, కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ సినిమాలో మెయిన్ హైలైట్స్ అవుతాయని ఆయన తెలిపారు. జాతీయ పురస్కారం అందుకున్న 'కలర్ ఫోటో' సినిమా నిర్మించింది ఈయనే.

అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, 'ఆటో' రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి యాక్షన్: అంజి, పృధ్వీ, సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, కిట్టూ విస్సాప్రగడ, కృష్ణ చైతన్య, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: దుర్గారావు గుండా, ఛాయాగ్రహణం: సాయి ప్రకాష్ ఉమ్మడిసింగు, సన్నీ కూరపాటి, నృత్యాలు: బృంద, మోయిన్, సంగీతం: మణిశర్మ, సహ నిర్మాతలు: అవనీంద్ర ఉపద్రష్ట, వికాస్ గున్నల, సమర్పణ: సి. యువరాజ్, నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పానేని, రచన - దర్శకత్వం: క్లాక్స్.