యువ కథానాయకుడు నిఖిల్ సిద్ధార్థ్ (Nikhil Siddhartha) కు కేరళ కుట్టి, అందాల భామ అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) నిద్ర లేకుండా చేశారు. ఇది రియల్ లైఫ్‌లో కాదు లెండి. రీల్ లైఫ్‌లో! అసలు మేటర్‌లోకి వెళితే...   


నిఖిల్, అనుపమ జంటగా నటించిన తాజా చిత్రం '18 పేజెస్' (18 Pages Movie). ఈ నెల 23న సినిమాను ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే మూడు పాటలను విడుదల చేశారు. ఈ రోజు నాలుగో పాట 'నీ వల్ల ఓ పిల్ల' లిరికల్ వీడియో విడుదల చేశారు. దీనికి ఓ ప్రత్యేకత ఉంది. అది ఏమిటంటే...
 
జానపదంలో '18 పేజెస్' గీతం!
గోపీ సుందర్ బాణీ అందించగా...'నీ వల్ల ఓ పిల్ల' పాటను రాసిందీ, పాడినదీ జానపద గాయకుడు తిరుపతి మెట్ల.


'నిదుర అన్నది లేదే... 
నీ వల్ల ఓ పిల్లా!
బాధ అయితుందే...
నీ యాదిలో నా గుండెల్లో' అంటూ ఈ గీతం సాగింది. విడుదలైన కొన్ని క్షణాల్లో ఈ పాటకు మంచి స్పందన లభిస్తోంది.


Also Read : 'అవతార్ 2' రివ్యూ : జేమ్స్ కామెరూన్ డిజప్పాయింట్ చేశాడా? వావ్ అనిపించాడా?



డిసెంబర్ 17న '18 పేజెస్' ట్రైలర్!
18 Pages Trailer : నిఖిల్, అనుపమల ప్రేమ కహానీ ఎలా ఉండబోతుందనేది 18 కంటే ఒక్క రోజు ముందు ప్రేక్షకులకు చూపించనున్నారు. డిసెంబర్ 17న '18 పేజెస్' ట్రైలర్ విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. రెగ్యులర్‌గా ట్రైలర్ రిలీజ్ అని కాకుండా వినూత్నంగా వీడియో ద్వారా ట్రైలర్ విడుదల తేదీ వెల్లడించారు. 


లెటర్ చింపేసిన అనుపమ
'18 పేజెస్' సినిమాలో అనుపమా పరమేశ్వరన్ లేఖలు రాసే అమ్మాయి పాత్రలో కనిపించనున్నారు. నిఖిల్ ఏమో ఎప్పుడూ మొబైల్ చెక్ చేసుకునే అబ్బాయి రోల్ చేశారు. ట్రైలర్ రిలీజ్ 18న అని ఒక పేజీ మీద రాసుకుని నిఖిల్ దగ్గరకు అనుపమ తీసుకు వెళతారు. అనుపమను పట్టించుకోకుండా నిఖిల్ మొబైల్ మాయలో మునుగుతాడు. అప్పుడు ఆ పేజీని సగం చింపేసి ఆమె తీసుకు వెళుతుంది. అదీ కథ!


సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి జీఏ 2 పిక్చర్స్‌ పతాకంపై '18 పేజెస్' చిత్రాన్ని 'బన్నీ' వాస్ నిర్మించారు. సుకుమార్ అందించిన కథతో రూపొందిన చిత్రమిది. దీనికి ఆయన శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించారు. ఆల్రెడీ సినిమాలో మూడు పాటలు విడుదల చేశారు. ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ ఆలపించిన 'ఏడు రంగుల వాన...'ను ఈ మధ్య విడుదల చేశారు. దానికి మంచి స్పందన లభిస్తోంది. అంతకు ముందు శింబు పాడిన బ్రేకప్ సాంగ్ కూడా వైరల్ అయ్యింది. 



'కార్తికేయ 2' తర్వాత మరోసారి!
'18 పేజెస్' సినిమాలో నిఖిల్ సరసన నిఖిల్, ఆమె నటించిన రెండో చిత్రమిది. తెలుగులో మాత్రమే కాదు... హిందీలో కూడా సూపర్ డూపర్ సక్సెస్ సాధించిన 'కార్తికేయ 2' సినిమాలో నటించిన నిఖిల్, అనుపమ జంటగా నటించిన సంగతి తెలిసిందే. '18 పేజీస్'తో 'కార్తికేయ 2' సక్సెస్ ట్రాక్‌ను నిఖిల్, అనుపమ కంటిన్యూ చేయాలని కోరుకుందాం! వీళ్ళ హిట్ సెంటిమెంట్‌కు తోడు గీతా ఆర్ట్స్ సెంటిమెంట్ కూడా ఒకటి ఉంది. 'కాంతార' వంటి విజయవంతమైన సినిమాను తెలుగు రాష్ట్రాల్లో ఆ సంస్థ డిస్ట్రిబ్యూట్ చేసింది. దాని తర్వాత వాళ్ళ నుంచి వస్తున్న చిత్రమిది. 'కుమారి 21 ఎఫ్' తర్వాత మరోసారి సూర్యప్రతాప్ పల్నాటి సినిమాకు సుకుమార్ స్క్రిప్ట్ అందిస్తున్నారు. అదీ సంగతి!