‘హిట్’ సిరీస్‌లో ఇటీవలే వచ్చిన ‘హిట్ 2’ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా చివర్లో రూత్‌లెస్ కాప్ ‘అర్జున్ సర్కార్’గా నాని పాత్రను దర్శకుడు శైలేష్ కొలను పరిచయం చేశారు. ‘హిట్ 3’లో హీరో తనే అని అధికారికంగా కన్ఫర్మ్ చేశారు. నాని కూడా తన ట్విట్టర్ ఖాతాలో అర్జున్ సర్కార్ పాత్ర గురించి ట్వీట్ చేశారు. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌లో నాని కనిపించనున్నాడు.
దీనిపై దర్శకుడు శైలేష్ కొలను కూడా స్పందించారు. ‘నా మాటలు గుర్తు పెట్టుకోండి. హిట్ 3లో అర్జున్ సర్కార్ పాత్రతో నేను నెక్స్ట్ లెవల్‌లో విధ్వంసం సృష్టించబోతున్నాను. ఇది నా ప్రామిస్.’ అని ట్వీట్ చేశారు. నాని, అడివి శేష్, విజయ్ సేతుపతిల కాంబినేషన్‌లో ‘హిట్ 3’ తెరకెక్కనుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.
మొదటి భాగంలో విష్వక్సేన్‌ను డిప్రెషన్‌లో ఉన్న పోలీస్‌గా చూపించిన శైలేష్, ‘హిట్ 2’లో అడివి శేష్‌ను కూల్ పోలీస్‌గా చూపించారు. ‘హిట్ 3’లో నానిని రూత్‌లెస్ కాప్‌గా చూపించబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ‘వంద మంది అమాయకుడు చచ్చినా పర్లేదు కానీ ఒక్క క్రిమినల్ కూడా తప్పించుకోకూడదు అనే ఐడియాలజీ ఉన్న పోలీస్ ఆఫీసర్ ఈ అర్జున్ సర్కార్.’ అంటూ తన పాత్ర ఎలా ఉండనుందో తెలిపారు.
‘హిట్ 3’లో నాని, అడివి శేష్‌లతో పాటు విష్వక్సేన్ కూడా ఉండనున్నట్లు శైలేష్ హింట్ ఇచ్చాడు. ఈ ముగ్గురితో కలిసి తను దిగిన ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసి ‘పెద్దదే ప్లాన్ చేస్తున్నాం. హిట్ 3 మాసివ్‌గా ఉండనుంది.’ అని క్యాప్షన్‌గా పెట్టారు. థ్రిల్లర్ జోనర్‌లో మొదటి రెండు సినిమాలు తీశారు. మరి మూడో సినిమా కూడా అదే జోనర్‌లో ఉంటుందా... లేకపోతే అర్జున్ సర్కార్ ఎలివేషన్ల కోసం యాక్షన్ బాట పట్టనున్నారా అనేది చూడాల్సి ఉంది.
‘హిట్ 3’ తీసేలోపు మరో సినిమా చేస్తానని రెండో భాగం ప్రమోషన్లలో డైరెక్టర్ శైలేష్ అన్నారు. ఇప్పుడు హిట్ 2 పెద్ద సక్సెస్ అయింది కాబట్టి మధ్యలో మరో సినిమా తీస్తారా లేకపోతే వెంటనే ఇదే ఊపులో ‘హిట్ 3’ని పట్టాలెక్కిస్తారా అనేది తెలియాల్సి ఉంది.
గత శుక్రవారం థియేటర్లలో విడుదల అయిన ‘హిట్ 2’ బ్లాక్ బస్టర్ కలెక్షన్లతో దూసుకుపోతుంది. మొదటి వీకెండ్‌లోనే 28 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయినట్లు తెలుస్తోంది. ‘అవతార్ 2’ విడుదల అయ్యే వరకు ‘హిట్ 2’ ప్రభంజనం కొనసాగే అవకాశం ఉంది.