Nuzvid Police Station : నూజివీడు పోలీస్ స్టేషన్ పై మహిళలు దాడికి పాల్పడ్డారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. పెద్ద సంఖ్యలో మహిళలు, గ్రామస్తలు స్టేషన్ ను ముట్టడించడంతో పోలీసులు స్టేషన్ తలుపులు మూసివేశారు. ఏలూరు జిల్లా రెడ్డిగూడెం మండలం కూనపరాజపర్వ గ్రామానికి చెందిన ఐశ్వర్యకు, ఆగిరిపల్లి మండలం వట్టిగుడిపాడు గ్రామానికి చెందిన రాజ్ కుమార్ కు మూడు నెలల క్రితం వివాహం జరిగింది.  వివాహం అనంతరం అదనపు కట్నం కోసం భార్య ఐశ్వర్యను రాజ్ కుమార్ తీవ్ర వేధింపులకు గురిచేశాడు. వారం రోజుల క్రితం భర్త కొడుతున్నాడని ఏడుస్తూ ఐశ్వర్య తల్లిదండ్రులకు ఫోన్ చేసింది. కుమార్తె కోసం ఐశ్వర్య తల్లిదండ్రులు అల్లుడి ఇంటికి వెళ్లారు. అల్లుడి ఇంటి వద్ద తమ కుమార్తె కనిపించకపోవడంతో ఐశ్వర్య తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పోలీసులు ఆశ్రయించారు. ఆ తర్వాత రాజ్ కుమార్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఐశ్వర్య తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నూజివీడు పోలీస్ స్టేషన్ ను ముట్టడించారు. పెద్ద సంఖ్యలో మహిళలు, గ్రామస్తులు నూజివీడు పోలీస్ స్టేషన్ కు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కొందరు మహిళలు స్టేషన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించాదు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. మహిళలు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. తమ కూతురు జాడ చెప్పాలంటూ ఐశ్వర్య తల్లిదండ్రులు, గ్రామస్తులు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. స్టేషన్ వద్ద భారీగా పోలీసులను మోహారించారు.  


చింతమనేని పీఎపై దాడి


ఏలూరు జిల్లాలో వైసీపీ వర్గీయులు టీడీపీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పీఏ సహా మరో ముగ్గురు టీడీపీ నేతలు గాయపడ్డారు. జిల్లాలోని పెదవేగి మండలం కొప్పాక సమీపంలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తిని కలిసేందుకు శివబాబు మరికొంత మందితో కలిసి జీపులో పెదకడిమి గ్రామంలోని రాజా తోటకు వెళ్తుండగా అలుగులగూడెం వెంతెన వద్ద వైసీపీ వర్గీయులు వీరి వాహనాన్ని ఆపారు. ఎక్కడికి వెళ్తున్నారని ప్రశ్నిస్తూనే, కర్రలు, రాడ్డులతో దాడికి దిగారు. ఈ ఘటనలో శివబాబు, మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. విషయం గుర్తించిన స్థానికులు వీరిని చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శివబాబు తలకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. అయితే కొప్పాక సమీపంలోని పోలవరం కుడి కాలువ వద్ద వైసీపీకి చెందిన కొందరు జేసీబీలతో మట్టి తవ్విస్తున్నారని, అదే సమయంలో తాము అటుగా వెళ్లడంతో వారిని అడ్డుకునేందుకు వెళ్తున్నామనుకొని తమపై దాడి చేశారని శివబాబు తెలిపారు. తమపై దాడి చేసిన వారిలో వైసీపీకి చెందిన కొప్పాక రంగారావు, పచ్చిపులుసు శివ, మరికొంత మంది ఉన్నారని ఆరోపించారు. 


దాడి జరిగిందని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ భార్య రాధ బాధితులను పరామర్శించారు. అయితే ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితులు చికిత్స పొందుతున్న సమయంలోనే.. వీరిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రంగారావు, శివ మరికొందరు వైద్యం కోసం ఇక్కడే చేరారు. ఈ క్రమంలో రెండు వర్గాల వారు ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడడంతో ఆస్పత్రి ఎదుట ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు.