Dasara Teaser: నాని నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘దసరా’ టీజర్‌ను నిర్మాతలు విడుదల చేశారు. పూర్తిగా రా, రస్టిక్ లుక్‌లో ఉన్న నానిని ఈ టీజర్‌లో చూడవచ్చు. పుష్ఫ తరహా టేకింగ్ కనిపిస్తుంది. సుకుమార్ శిష్యుడే ఈ సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓడెల. నాని కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతుంది. సింగరేణి గనుల బ్యాక్‌డ్రాప్‌తో నడిచే కథను ఎంచుకున్నారు. ఈ సినిమా తెలుగు టీజర్‌ను దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి విడుదల చేశారు. తమిళ టీజర్‌ను విలక్షణ నటుడు ధనుష్, కన్నడ టీజర్‌ను రక్షిత్ శెట్టి, మలయాళ టీజర్‌ను దుల్కర్ సల్మాన్, హిందీ టీజర్‌ను షాహిద్ కపూర్ లాంచ్ చేయడం విశేషం.



సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీని మార్చి 30వ తేదీన విడుదల చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు. కొద్ది రోజుల కిందటే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ దశలోనే అదిరిపోయే బిజినెస్‌ను సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 


ఇప్పటికే ఈ సినిమాకి రూ.100 కోట్ల బిజినెస్ జరిగిపోయిందని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. కొత్త దర్శకుడితో నాని లాంటి మిడ్ రేంజ్ హీరో నటించిన ఈ సినిమాకు రూ.వంద కోట్లు బిజినెస్ జరిగిందంటే నిజంగా గొప్ప విషయమే. ఈ సినిమా బడ్జెట్ కూడా రూ.65 కోట్లు పైగానే అయిపోయిందని వినిపిస్తుంది. నాని కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఇది. కానీ విడుదలకు ముందే రూ.35 కోట్ల టేబుల్ ప్రాఫిట్ వచ్చిందంటే గ్రేటే.


అమెజాన్ ప్రైమ్ చేతికి నాన్ థియేట్రికల్ రైట్స్?
‘దసరా’ మూవీ నాన్ థియేట్రికల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందని వార్తలు వస్తున్నాయి. ఇందుకు రూ.30 కోట్ల వరకు ఆఫర్ చేసిందని సమాచారం. ఇతర భాషలకు చెందిన రైట్స్‌కు మరో రూ.10 కోట్లు వచ్చినట్లు వినిపిస్తుంది. ఇక శాటిలైట్ రైట్స్ రూపంలో మరో రూ.20 కోట్లు అదనంగా వచ్చాయట. అంటే కేవలం నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే సినిమా బడ్జెట్ రూ.60 కోట్లు రికవర్ అయిపోయినట్లే. ఇక సినిమా హిట్ టాక్ సొంతం చేసుకుంటే నిర్మాతకు నిజంగా దసరా పండుగే. ఎందుకంటే ‘దసరా’ సినిమా థియేట్రికల్ రైట్స్ రూ.40 కోట్ల వరకు అమ్ముడయ్యాయట. అంటే మొత్తం కలుపుకొని రూ.100 కోట్లు అన్నమాట. నాని కెరీర్‌లో ఏ సినిమా ఇంత బిజినెట్ జరగలేదు.


తెలంగాణలోని గోదావ‌రిఖ‌ని సమీపంలో ఉన్న సింగ‌రేణి ప్రాంతానికి చెందిన ఫిక్ష‌న‌ల్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ‘దసరా’ సినిమాను తీస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వాహబ్, రోషన్ మాథ్యూస్ లాంటి తారలు కూడా కీలకపాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కూడా విడుదల కానుంది. నాని నటించిన తొలి పాన్ ఇండియా చిత్రం ఇదే. ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించనున్నారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్‌ కాగా, నవీన్ నూలి ఎడిటర్‌‌గా వ్యవహరించనున్నారు.