ప్రముఖ సినీ నటి నందిత శ్వేత ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తండ్రి అకస్మాత్తుగా మరణించడంతో నందిత కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. తండ్రిని కోల్పోయిన విషయాన్ని నందిత సోషల్ మీడియాలో నేరుగా వెల్లడించింది. ఈ మేరకు ఆమె పోస్ట్ పెడుతూ.. ''నా తండ్రి శ్రీ శివస్వామి 54 సంవత్సరాల వయస్సులో కన్నుమూశారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. నా శ్రేయోభిలాషులందరికి ఈ విషయాన్ని తెలియజేయాలనుకున్నాను'' అంటూ రాసుకొచ్చింది. 

 


 

ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆమెకి సంతాపం తెలియజేస్తున్నారు. నందిత తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. 'నంద లవ్స్ నందిత' అనే సినిమాతో నందిత నట జీవితాన్ని మొదలుపెట్టింది. ఆ తరువాత 2012లో 'అట్టకత్తి' సినిమాతో కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. 2016లో తెలుగులో విడుదలైన 'ఎక్కడకి పోతావు చిన్నవాడా' సినిమాలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.