కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణించడంతో నందమూరి బాలకృష్ణ ఎంతో ఎమోషనల్ అయ్యారు. విషయం తెలుసుకున్న వెంటనే ఆయన బెంగుళూరు చేరుకున్నారు. శనివారం ఉదయం కంఠీరవ స్టేడియంకు వెళ్లి పునీత్ ను ఆఖరి చూపు చూసుకొని నివాళులు అర్పించారు. పునీత్ పార్థివదేహాన్ని చూసి భావోద్వేగానికి గురై ఆయన ఏడ్చేశారు. తన పక్కనే ఉన్న పునీత్ రాజ్ కుమార్ సోదరుడిని పరామర్శిస్తూ మరింత ఎమోషనల్ అయ్యారు.
Also Read: ఎప్పటికీ మా గుండెల్లో ఉంటావ్! - పునీత్ మరణంపై అనుష్క స్పందన
అనంతరం మీడియాతో మాట్లాడారు బాలయ్య. పునీత్ మన మధ్య లేరన్న విషయాన్ని నమ్మలేకపోతున్నానని.. ఆయన మరణం వ్యక్తిగతంగా తనకు తీరని లోటని అన్నారు. ఆయన మరణవార్త తనను ఎంతో కలచివేస్తోందని కన్నీళ్లు పెట్టుకున్నారు. రాజ్ కుమార్ కుటుంబంతో ఎంతో అనుబంధం ఉందని చెప్పిన బాలయ్య.. ఒక తల్లి కడుపున పుట్టకపోయినా మేమంతా అన్నదమ్ముల్లా కలిసిమెలిసి ఉండేవాళ్లమని అన్నారు.
ఒక కాళాకారుడిగా ప్రేక్షకులను అలరిస్తూ.. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన పునీత్ మరణం చూస్తే.. దేవుడు ఎంతో అన్యాయం చేశాడనిపిస్తోందని అన్నారు.
తను నటించిన 'ఎన్టీఆర్' సినిమా ప్రమోషన్స్ కి కూడా పునీత్ వచ్చాడని గుర్తుచేసుకున్నారు. ఒక కళాకారుడిగా, మంచి మనిషిగా ఆయన ఎప్పటికీ మన గుండెల్లోనే ఉంటారని.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
బాలకృష్ణతో పాటు టాలీవుడ్ కి చెందిన చాలా మంది ప్రముఖులు పునీత్ పార్థివ దేహాన్ని చూసేందుకు బెంగుళూరు వెళ్లారు. బాలయ్య వెళ్లిన కాసేపటికే ఎన్టీఆర్ కూడా అక్కడకు చేరుకొని కన్నీరుమున్నీరయ్యారు. పునీత్ సోదరుడు శివ రాజ్‌కుమార్‌ను హత్తుకుని ఓదార్చారు. నరేశ్, శివబాలాజీ, ప్రభుదేవా సైతం నివాళులర్పించారు.