Hero Balakrishna Golden Jubilee Celebrations: నటసింహం నందమూరి బాలకృష్ణ తెలుగు సినిమా పరిశ్రమలో 50 ఏళ్లు నట జీవితాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. రీసెంట్ గా హైదరాబాద్ హెచ్ఐసీసీలో జరిగిన ఈ వేడుకలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో పాటు పలువురు సినీ, రాజకీయ దిగ్గజాలు పాల్గొన్నారు. సీనియర్ నటులు మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు సహా, టాలీవుడ్ యంగ్ హీరోలు, హీరోయిన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలయ్య నట జీవితంపై ప్రశంసలు కురిపించారు. నటుడిగా, సమాజ సేవకుడిగా ఆయన సేవలు అభినందనీయమన్నారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని నెమరువేసుకున్నారు. ఇక వేడుకలు దసరా కానుకగా బుల్లితెరపై ప్రసారం కానున్నాయి. బాలయ్య అభిమానులతో పాటు సినీ లవర్స్ ను అలరించనున్నాయి.
దసరా కానుగా స్వర్ణోత్సవ వేడుకల ప్రసారం
నటుడు బాలయ్య స్వర్ణోత్సవ వేడుకలు ఈటీవీ వేదికగా ప్రసారం కానున్నాయి. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఈటీవీ యాజమాన్యం ప్రకటించింది. దసరా కానుకగా, అక్టోబర్ 11న ఉదయం 9 గంటల నుంచి ఈ వేడుకలు టెలీకాస్ట్ అవుతాయని తెలిపింది. ఈ ప్రకటనతో బాలయ్య అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. తమ అభిమాన నటుడి స్వర్ణోత్సవ వేడుకలను చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
'తాతమ్మ కల'తో మొదలైన బాలయ్య సినీ ప్రయాణం
నటసింహం నందమూరి బాలయ్య 1974లో విడుదలైన 'తాతమ్మ కల' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. 50 ఏండ్లుగా సినీ పరిశ్రమలో తిరుగులేని నట ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. సక్సెస్, ఫెయిల్యూర్స్ తో సంబంధం లేకుండా ప్రేక్షకులను అలరిస్తూ ముందుకుసాగుతున్నారు. వైవిధ్యభరిత కథలు, పాత్రల ఎంపికతో టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరిగా వెలుగొందుతున్నారు. తండ్రి నందమూరి తారక రామారావు నట వారసత్వాన్ని ఒడిసిపట్టుకుని తెలుగు సినిమా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన కెరీర్ లో వందకు పైగా సినిమాలు, ఎవరికీ సాధ్యం కాని క్యారెక్టర్లతో దూసుకెళ్తున్నారు. దివంగత ఎన్టఆర్ తర్వాత ఆ స్థాయిలో అద్భుత పాత్రలు పోషించిన నటుడిగా బాలయ్య పేరు తెచ్చుకున్నారు.
మాస్, క్లాస్ అనే తేడా లేకుండా అన్ని క్యారెక్టర్లలో అద్భుతంగా ఒదిగిపోయిన నటించిన నటుడు బాలయ్య. ‘మంగమ్మ గారి మనువడు‘, ‘నారీ నారీ నడుమ మురారి‘ లాంటి సాంఘిక చిత్రాలతో పాటు 'ఆదిత్య 369' లాంటి సైన్స్ ఫిక్షన్ మూవీస్, భైరవద్వీపం' లాంటి జానపద చిత్రాలలో నటించారు. ‘నరసింహనాయుడు‘ లాంటి ఫ్యాక్షన్ క్యారెక్టర్లతో రక్తపుటేరులు పారించారు. 'గౌతమిపుత్ర శాతకర్ణి' లాంటి చారిత్రక సినిమాల్లోనూ నటించి ఆహా అనిపించారు. ఆయన నటించిన సినిమాల్లో 500 రోజులకు పైగా ఆడిన సందర్భాలున్నాయి. దీన్ని బట్టి ఆయనను ప్రేక్షకులు ఎంతలా అభిమానిస్తారో అర్థం చేసుకోవచ్చు.
Read Also: అమితాబ్ ఫస్ట్ బెంచ్ స్టూడెంట్ అయితే రజనీది లాస్ట్ బెంచ్ - వేట్టయన్ దర్శకుడి సెన్సేషనల్ కామెంట్స్