టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు  గత కొంత కాలంగా ఎంతో మంది చిన్నారులకు వైద్య సేవలు అందిస్తున్నారు. సొంత ఖర్చులతో చాలా మంది పేద పిల్లలకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో చిన్నారులకు హృదయ సంబంధ శస్త్ర చికిత్సలు చేయించారు. అయితే, మహేష్ బాబు చిన్నారుకు అందించే వైద్య సేవలన్నీ విజయవాడ కేంద్రంగా పని చేస్తున్న ఆంధ్రా హాస్పిటల్స్  సహకారంతోనే కొనసాగిస్తున్నారు.


విశాఖలో ఆంధ్రా హాస్పిటల్స్ సేవలు షురూ


ఇప్పటి వరకు విజయవాడ కేంద్రంగా కొనసాగుతున్న ఆంధ్రా హాస్పిటల్స్ సేవలు ప్రస్తుతం విస్తరిస్తున్నాయి. తాజాగా విశాఖపట్నంలో  కొత్త హాస్పిటల్ ను ఏర్పాటు చేశారు. ఇకపై వైజాగ్ లోనూ ఆంధ్రా హాస్పిటల్స్ సేవలు కొనసాగుతాయని మహేష్ బాబు ప్రకటించారు. అంతేకాదు, విశాఖ పరిసరాల్లోని పిల్లలకు ఇకపై అక్కడే వైద్య సేవలు అందించనున్నట్లు తెలిపారు.


విశాఖ ఆంధ్రా హాస్పిటల్లో మహేష్ ఫౌండేషన్ పిడియాట్రిక్ వార్డు


తాజాగా ఆంధ్రా హాస్పిటల్ విశాఖ కు సంబంధించిన వివరాలను మహేష్ సతీమణి నమ్రత వెల్లడించారు. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు ఫౌండేషన్ కు సంబంధించి ప్రత్యేక పిడియాట్రిక్ వార్డును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ వార్డుకు సంబంధించిన ఫోటోలను ఆమె ఇన్ స్టాలో షేర్ చేశారు.  ఆంధ్రా హాస్పిటల్స్ విశాఖలోనూ ఏర్పాటవడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రా హాస్పిటల్స్ ఇప్పుడు విశాఖపట్నంలోనూ ద్వారాలు తెరిచిందని వెల్లడించారు. ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్యం అందించాలన్న ఆంధ్రా హాస్పిటల్స్ ఇకముందు కూడా మరింత విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.  ఆసుపత్రి వర్గాలకు నమ్రత శుభాకాంక్షలు తెలిపారు. మహేష్ బాబు తన ఫౌండేషన్ ద్వారా పిల్లలకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫౌండేషన్ పిల్లల వార్డు బాధ్యత తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆ హాస్పిటల్‌తో ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.






మహేష్ బాబు-నమ్రత శిరోద్కర్ టాలీవుడ్ లో స్టార్ కపుల్స్‌ గా గుర్తింపు తెచ్చుకున్నారు. బి.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వంశీ’ అనే చిత్రంలో వీరిద్దరు కలిసి నటించారు. అప్పుడే వీరి మధ్య పరిచయం ఏర్పడింది. సుమారు నాలుగు సంవత్సరాల పాటు ప్రేమాయణం నడిపించారు. 2005 ఫిబ్రవరి 10న వివాహం ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరి పెళ్లై దాదాపు 18 ఏళ్లైనా ఇప్పటివరకు ఎలాంటి గొడవలు లేకుండా సుఖసంతోషాలతో జీవితాన్ని గడుపుతున్నారు.  వీరికి గౌతమ్, సితార ఇద్దరు పిల్లలున్నారు. అయితే, వీరిద్దరు ఇంట్లో వారికి తెలియకుండా పెళ్లి చేసుకున్నారనే వార్తలు అప్పట్లో వినిపించాయి. వివాహం తర్వాత నమ్రత సినిమాలకు పూర్తిగా దూరమైంది. మహేష్ బాబు మాత్రం వరుస సినిమాలు చేస్తూ టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు.   మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘గుంటూరు కారం’ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అటు రాజమౌళి దర్శకత్వంలో ఓ  ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చేస్తున్నారు. యాక్షన్ అండ్వెంచరస్ మూవీగా ఈ చిత్రం తెరకెక్కనున్నట్లు దర్శకుడు రాజమౌళి ఇప్పటికే వెళ్లడించారు.


Read Also: అమీర్ ఖాన్, కరిష్మా ముద్దులు, అయోమయంలో తమన్నా ప్రియుడు విజయ్ వర్మ- అసలేం జరిగిందంటే?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial