పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న 'రాధేశ్యామ్' సినిమాను జనవరి 14న విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. దీనికి తగ్గట్లుగా సినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. 'రాధేశ్యామ్' టీజర్ ని విడుదల చేయగా.. అది బాగా ట్రెండ్ అయింది. రీసెంట్ గా సినిమాలో తొలి పాట 'ఈ రాతలే..'ను కొన్ని రోజుల క్రితమే విడుదల చేశారు.
ఇప్పుడు రెండో సాంగ్ ను విడుదల చేయనున్నారు. డిసెంబర్ 1న ఫుల్ సాంగ్ విడుదల చేయనున్నట్టు పేర్కొన్నారు. ఈరోజు ఉదయమే ఈ పాట హిందీ వెర్షన్ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇప్పుడేమో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం.. దక్షిణాది భాషల్లో సాంగ్ టీజర్ విడుదల చేశారు. తెలుగులో 'నగుమోము తారలే..'గా ఈ పాట విడుదల కానుంది. సిద్ శ్రీరామ్ ఈ పాటను ఆలపించారు.
రెబల్‌స్టార్ కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణా మూవీస్, యువీ క్రియేషన్స్ పతాకాలపై ప్రమోద్, వంశీ, ప్రశీద ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. యూరప్ నేపథ్యంలో జరిగే పీరియాడికల్ లవ్‌స్టోరిగా ఈ సినిమాను రూపొందించారు. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. దాదాపు మూడు వందల కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. డిసెంబర్ రెండో వారం, లేదా మూడో వారంలో సినిమా ట్రైలర్ ను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.