Nagarjuna defamation case against Konda Surekha withdrawn: అక్కినేని నాగార్జున, తెలంగాణ మంత్రి కొండా సురేఖ మధ్య జరుగుతున్న పరువు నష్టం కేసును కోర్టు మూసివేసింది. ఫిర్యాదిదారు నాగార్జున భారతీయ నాగరిక సురక్షా సంహిత సెక్షన్ 280 ప్రకారం కోర్టును అభ్యర్థించి కేసును ఉపసంహరించుకుంటున్నానని తెలిపారు. కోర్టు ఈ పిటిషన్‌ను అంగీకరించి, కేసును "ఉపసంహరణ మూసివేసినట్టుగా" డిస్మిస్ చేసింది.
2024 అక్టోబర్ 2న తెలంగాణ మంత్రి కొండా సురేఖ, బీఆర్ఎస్ అధినేత కేటీఆర్‌పై విమర్శలు చేస్తూ నాగార్జున ఫ్యామిలీని కూడా అందులోకి తెచ్చారు. నాగార్జున కుమారుడు నాగ చైతన్య, సమంత రూత్ ప్రభు విడాకులకు కేటీఆర్ కారణం అన్నారు. ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకంగా ఉండటంతో సినిమావర్గాలతో పాటు ఇతర రాజకీయవర్గాలు కూడా ఖండించాయి. కొండా సురేఖ వ్యాఖ్యలు తమ కుటుంబ పరువు తీసేలా ఉన్నాయని హైదరాబాద్ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు.
సురేఖ మొదట క్షమాపణలు చెప్పకపోవడంతో కేసు కోర్టులో విచారణ జరుగుతోంది. కానీ 12వ తేదీన అర్థరాత్రి సురేఖ సోషల్ మీడియాలో పబ్లిక్ గా క్షమాపణ చెప్పారు. "నా ఉద్దేశం నాగార్జున , ఆయన కుటుంబాన్ని బాధపెట్టడం కాదు. నా వ్యాఖ్యలు తప్పుగా అర్థమయ్యాయి. క్షమాపణలు చెప్పి వెనక్కి తీసుకుంటున్నానన్నారు. ఈ క్షమాపణ తర్వాత నాగార్జున కేసును ముగించాలని నిర్ణయించుకున్నారు. బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 280 ప్రకారం ఫిర్యాది ఉపసంహరణ అనుమతి కోసం కోర్టును అభ్యర్థించారు. కోర్టు ఈ అభ్యర్థనను తక్షణమే అంగీకరించి, కేసును మూసివేసింది.
అయితే కొండా సురేక చేసిన ఆరోపణలపై కేటీఆర్ దాఖలు చేసిన కేసు విచారణ కొనసాగుతుంది. సంబంధం లేని విషయాల్లో కొండా సురేఖ తనపై అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. తన గౌరవానికి భంగం కలిగించాలనే లక్ష్యంతోనే, ఏ ఆధారాలు లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేశారని లీగల్ నోటీసుల్లో కేటీఆర్ పేర్కొన్నారు. కేటీఆర్ సైతం విచారణకు హాజరయ్యారు. మహిళను కించపరిచారని, తన గౌరవానికి భంగం వాటిల్లేలా వ్యాఖ్యలు చేశారని కోర్టుకు తెలిపారు. ఈ కేసును కేటీఆర్ కొనసాగిస్తున్నారు. కొండా సురేఖ కేటీఆర్ కు క్షమాపణలు చెప్పలేదు.