నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటిస్తోన్న చిత్రం 'వరుడు కావలెను'. లక్ష్మీ సౌజన్య దర్శకత్వం వహించిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమా అక్టోబర్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన రానా ట్రైలర్ ను విడుదల చేశారు.
పెళ్లిచూపుల కాన్సెప్ట్ అంటేనే పడని అమ్మాయిని.. ఇంప్రెస్ చేయడానికి ప్రయత్నిస్తుంటాడు హీరో. అది అంత సులువైన విషయం కాదని తెలుసుకుంటాడు. ఆ తరువాత హీరో-హీరోయిన్ మధ్య మనస్పర్థలు చోటుచేసుకోవడం.. 'భూమి, ఆకాశం ఎదురెదురుగా ఉన్నా.. ఎప్పటికీ కలవలేవు' అనే డైలాగ్స్ వింటుంటే సినిమా ఎలా ఉండబోతుందో అర్ధమవుతోంది. ట్రైలర్ మధ్యలో కొన్ని ఎమోషన్స్ ను జోడించారు.
ఓవరాల్ గా ట్రైలర్ బాగానే ఉన్నప్పటికీ.. ఒక ఫ్లోలో కట్ చేయలేదనే ఫీలింగ్ కలుగుతోంది. ట్రైలర్ లో ఎక్కువగా.. రీతూ క్యారెక్టర్ ను ఎలివేట్ చేసే ప్రయత్నం చేశారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ట్రైలర్ కి ప్లస్ అయింది. అటు యూత్, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే ఎలిమెంట్స్ అయితే ట్రైలర్ లో కనిపిస్తున్నాయి. మరి ఈ సినిమా చూడాలంటే నెలాఖరు వరకు ఎదురుచూడాల్సిందే!