ఇటీవల కాలంలో సినిమా పాటల కంటే ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ ఆడియన్స్ ని ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా తెలంగాణ జానపద గీతాలకు సినీ పరిశ్రమ నుంచి సైతం మంచి రెస్పాన్స్ వస్తోంది. అగ్ర హీరోల సినిమాల్లో ఈమధ్య ఖచ్చితంగా ఒక జానపదం రూపంలో ఓ ఫోక్ సాంగ్ ఉంటుంది. ఉదాహరణకు.. తీసుకుంటే 'బలగం' సినిమాలోని పాటలన్నీ కూడా తెలంగాణ జానపదాలకు సంబంధించినవే. ఆ పాటలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో తెలిసిందే. అలాగే మాస్ మహారాజు రవితేజ నటించిన 'ధమాకా' సినిమాలోని 'దండకడియాల్', 'జింతాత' వంటి ఫోక్ సాంగ్స్ ఎంతటి ఆదరణను కనబరిచాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అలా ఈమధ్య సినిమాల్లో ఫోక్ సాంగ్స్ కి ఫుల్ ప్రయారిటీ పెరిగింది. అటు ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ కి కూడా మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇప్పటికే యూట్యూబ్లో కొన్ని ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ చాలావరకు ట్రెండింగ్ లో ఉన్నాయి. అటు శ్రోతలు కూడా ఈ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ ని ఎంతో ఆదరిస్తున్నారు.
అలా 'నివృతి వైబ్స్' అనే సంస్థ ఇప్పటికే పలు ప్రైవేట్ ఆల్బమ్స్ ని రిలీజ్ చేయగా వాటికి ఆడియన్స్ నుంచి భారీ స్పందన లభించింది. ఈ ప్రైవేట్ సాంగ్స్ కి మంచి ప్రొడక్షన్ వాల్యూస్ తో పాటు అదిరిపోయే విజువల్స్ తో పాటలను చిత్రీకరించి యూట్యూబ్లో రిలీజ్ చేస్తే అవి మిలియన్ల కొద్ది వ్యూస్ అందుకుంటున్నాయి. ఇప్పటికే నివృత్తి సంస్థ విడుదల చేసిన 'జరీ జరీ పంచే కట్టి', 'సిలక ముక్కు దాన', 'గంగులు', 'జంజీరే', 'వద్దన్నా గుండెల్లో సేరి' వంటి ఫోక్ సాంగ్స్ కి ఆడియన్స్ నుంచి మంచి ఆదరణ దక్కింది. ఇక వీటిలో 'జరి జరీ పంచే కట్టి', 'గంగులు' వంటి పాటల్లో బుల్లితెర హాట్ యాంకర్ విష్ణు ప్రియ, సీరియల్ నటుడు మానస్ జంటగా నటించి తమ డాన్స్ తో ఆకట్టుకున్నారు. ఇప్పటికే యూట్యూబ్లో ఈ పాటలు ట్రెండింగ్ లో నిలిచిన సంగతి తెలిసిందే.
తాజాగా ఇదే 'నివృతి వైబ్స్' సంస్థ మరో తెలంగాణ జానపదంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. "నా ఫ్రెండ్ దేమో పెళ్లి నాకేందిర ఈ లొల్లి" అంటూ సాగే మ్యూజిక్ వీడియో ని నివృతి వైబ్స్ రిలీజ్ చేసింది. ఈ పాటని ప్రముఖ నటుడు జేడీ చక్రవర్తి చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. ఇక ఈ పాటలో జయతి మెయిన్ లీడ్ గా నటించింది. ప్రముఖ సంగీత దర్శకుడు బీమ్స్ సిసిరోలియో ఈ పాటకు మ్యూజిక్ అందించారు. ప్రముఖ గేయ రచయిత కాసర్ల శ్యామ్ రచించిన ఈ పాటను సింగర్ శ్రావణ భార్గవి ఎంతో అద్భుతంగా ఆలపించింది. ఇక బుల్లితెరపై వెన్నెల అనే షో తో ఆడియన్స్ లో ఎంతో మంచి క్రేజ్ ను సంపాదించుకున్న జయతి ఈ పాటలో తన అద్భుతమైన హావభావాలతో తన డాన్స్ మూమెంట్స్ తో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతోంది. ముఖ్యంగా ఫోక్ సాంగ్స్ ని ఇష్టపడే శ్రోతలు ఈ పాటను రిపీట్ మోడ్లో చూస్తూ ఉండటం విశేషం. ఇక సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తో దూసుకుపోతున్న ఈ పాటను మీరు కూడా చూడాలంటే 'నివృతి వైబ్స్' అనే యూట్యూబ్ ఛానల్ లో అందుబాటులో ఉంది చూసేయండి.
Read Also: 10 రోజుల్లో రూ.100 కోట్లు వసూల్, తెలుగులోకీ రాబోతున్న మలయాళం బ్లాక్ బస్టర్ మూవీ!