Naveen Yerneni: టాలీవుడ్‌లోని బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన నవీన్ యెర్నేని అస్వస్థతకు గురయ్యారు. గురువారం రాత్రి ఆయనకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఆస్పత్రిలో చేరిన నవీన్‌ యెర్నేనికి వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. అయితే నవీన్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఆందోళన చెందాల్సిందేదీ లేదని కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. 


మూడు రోజులుగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్నారు. వీరితో పాటు క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఇంటిలో కూడా ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నవీన్ అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతానికి నవీన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని డాక్టర్లు చెప్పారు.


మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ చిత్రాలను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ సంవత్సరం సంక్రాంతికి ఒక రోజు వ్యవధిలోనే చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, బాలయ్య ‘వీరసింహారెడ్డి’ సినిమాలను విడుదల చేసి బ్లాక్‌బస్టర్ కొట్టారు. అయితే అంతకు ముందే 2021లో ‘పుష్ప : ది రైజ్’తో పాన్ ఇండియా బ్లాక్ బాస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ‘పుష్ప 2:  ది రూల్’ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. దాదాపు రూ.400 కోట్ల వరకు బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఐటీ రైడ్స్ కారణంగా ‘పుష్ప 2:  ది రూల్’ షూటింగ్ కూడా ఆగిపోయిందట.


ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ‘ఖుషి’,‘పుష్ప 2 : ది రూల్’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి. ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘ఎన్టీఆర్31/32’ వచ్చే సంవత్సరం సెట్స్ మీదకు వెళ్లనుంది.


అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా 'పుష్ప ఎక్కడ?' అంటూ యూనిట్ విడుదల చేసిన వీడియో వైరల్ అయ్యింది. తొలి భాగంలో చూపించిన దానికి పూర్తి భిన్నంగా మలి భాగం ఉంటుందని పుష్ప ఎక్కడ ఉన్నాడో రివీల్ చేసిన వీడియో చూస్తే అర్థం అవుతోంది. 


శేషాచలం అడవుల్లో పుష్పరాజ్ ఉన్నట్లు చూపించారు. 'పుష్ప'లో కథానాయకుడిని కేవలం స్మగ్లర్ కింద చూపిస్తే... ఇప్పుడీ రెండో భాగంలో ఆయన్ను నాయకుడిని చేశారు. స్మగ్లింగ్ చేసి సంపాదించిన డబ్బుతో పేదలకు ఓ దారి చూపించడం మాత్రమే కాదు... వాళ్ళ పిల్లలకు విద్య, అవసరమైన వాళ్ళకు వైద్యం చేయించినట్టు తెలిపారు. దాంతో 'పుష్ప'కు అభిమానులు ఏర్పడ్డారు. 


పులి రెండు అడుగులు వెనక్కి వేస్తే... 'వేర్ ఈజ్ పుష్ప' వీడియో మొత్తం ఒక ఎత్తు... చివరలో కేశవ చెప్పే మాట మరో ఎత్తు! అడవిలో పులుల జాడ తెలుసుకోవడం కోసం నైట్ విజన్ కెమెరాలు ఏర్పాటు చేస్తారు. ఓ కెమెరాలో పులి కనబడుతుంది. అలాగే, కంబలి కప్పుకున్న మరో మనిషి కూడా! అతడిని చూసి పులి రెండు అడుగులు వెనక్కి వేస్తుంది. అప్పుడు వెనుక ఓ డైలాగ్.'అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్థం. అదే పులి రెండు అడుగులు వెనక్కి వస్తే పుష్ప వచ్చాడని అర్థం' అని కేశవ చెప్పే డైలాగుతో పుష్ప ముఖాన్ని చీకటిలో చూపించారు. పుష్ప బతికి ఉన్నాడని ప్రజలు సంబరాలు చేసుకున్నారు. 


సుకుమార్ దర్శకత్వంలో మైత్రి మూవీస్ ఇన్ అసోసియేట్ విత్ సుకుమార్ రైటింగ్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీవల్లి పాత్రలో రష్మికా మందన్నా (Rashmika Mandanna) మరోసారి సందడి చేయనున్నారు.