2022 పాన్ ఇండియన్ సినిమాలకు బాగా కలిసి వచ్చింది. సౌత్ ఇండియా నుంచి తెరకెక్కిన పలు పాన్ ఇండియన్ సినిమాలు దేశ వ్యాప్తంగా సంచలన విజయాలను అందుకున్నాయి. వసూళ్ల పరంగా బాక్సాఫీస్ రికార్డులు బద్దలుకొట్టాయి. విదేశాల్లోనూ మంచి ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి. తాజాగా ‘RRR’, ‘KGF-2’ సినిమాలు వికీపీడియాలోనూ సరికొత్త రికార్డులు సృష్టించాయి. ఈ ఏడాది వికీపీడియాలో అత్యధికంగా చదివిన సినిమాలుగా నిలిచాయి.
వికీపీడియా టాప్ వ్యూస్ లిస్టులో ‘RRR’, ‘KGF-2’
2022లో అత్యధికంగా చదివిన అగ్రకథనాల జాబితాను వికీపీడియా వెల్లడించింది. ఈ టాప్ లిస్టులో పాన్ ఇండియన్ సినిమాలు ‘RRR’, ‘KGF-2’ చోటు సంపాదించుకున్నాయి. 'KGF: చాప్టర్ 2' గురించి వికీపీడియాలో 15,954,912 మంది చదవగా, 'RRR' గురించి 15,594,732 మంది వెతికారు.
టాప్ 1,2 స్థానాల్లో జానీ డెప్, అంబర్ హర్డ్
సినీ ఇండస్ట్రీకి చెందిన నటీనటులు, మాజీ దంపతులు జానీ డెప్, అంబర్ హర్డ్ ఈ సంవత్సరంలో అత్యంత దృష్టిని ఆకర్షించిన వ్యక్తులుగా నిలిచారు. వీరిద్దరు వికీపీడియాలో వరుసగా 19,544,593; 19,067,943 పేజీ వ్యూస్ కలిగి ఉన్నారు. ఎంటర్ టైన్మెంట్ రంగంలో ఏడాదంతా ఆకట్టుకున్న వ్యక్తులుగా నిలిచారు. డెప్ దంపతుల మధ్య వివాదాల కారణంగా నిత్యం వార్తల్లో నిలిచారు. సుదీర్ఘ విచారణ తర్వాత, డెప్ తన జీవిత భాగస్వామి మీద వేసిన దావా కేసులు విజయం సాధించారు. ఈ వివాదం కారణంగా ఆయన వికీపీడియాలో అత్యధికంగా సెర్చ్ చేసిన ప్రముఖుల లిస్టులో చేరారు. 2022లో యాంబర్ గూగుల్ సెర్చ్ ట్రెండ్స్ లో ముందంజలో ఉన్నారు. ఆమె తర్వాతి స్థానంలో తన మాజీ భర్త జానీ నిలిచారు. అమెరికాలో నెలకు 5.6 మిలియన్ సెర్చ్ లతో 2022లో ఎక్కువగా శోధించబడిన ప్రముఖుల జాబితాలో అంబర్ హర్డ్ అగ్రస్థానంలో నిలిచారు. 5.5 మిలియన్ల నెలవారీ శోధనలతో ఈ జాబితాలో జానీ డెప్ రెండవ ప్లేస్ దక్కించుకున్నారు.
ఈ జాబితాలో 'గేమ్ ఆఫ్ థ్రోన్స్', 'హౌస్ ఆఫ్ ది డ్రాగన్'కి HBO ప్రీక్వెల్ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈ రెండు వికీపీడియా పేజీ వ్యూస్ 16,421,891కి చేరుకున్నాయి. 'హౌస్ ఆఫ్ ది డ్రాగన్' ఆగస్టులో డిస్నీ+ హాట్ స్టార్ లో ప్రీమియర్ అయిన తర్వాత చాలా దృష్టిని ఆకర్షించింది. 'డాక్టర్ స్ట్రేంజ్ ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్' (15,982,987 పేజీ వీక్షణలు), 'KGF: చాప్టర్ 2' (15,954,912), 'టాప్ గన్ మావెరిక్' (15,858,877), 'RRR' (15,594,732) తర్వాతి స్థానాల్లో నిలిచారు. నటుడు ఎల్విస్ ఆరోన్ ప్రెస్లీ వికీపీడియా పేజీని 2022లో 15,391,295 మంది వరకు వీక్షించారు. ‘RRR’, ‘KGF-2’ సినిమాలు వికీపీడియాలో టాప్ ర్యాంక్ దక్కించుకోవడం పట్ల సినీ లవర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో అభినందనలు చెప్తున్నారు. సౌత్ సినిమాలు మరిన్ని అరుదైన రికార్డులు సాధించాలని కోరుకుంటున్నారు.
Read Also: అల్లు అర్జున్‌కు అరుదైన గౌరవం, ఆ అవార్డు అందుకున్న తొలి తెలుగు నటుడిగా గుర్తింపు