మార్చి 19న టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్ బాబు పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. తిరుపతిలో శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల ఆవరణలో గ్రాండ్ గా ఆయన బర్త్ డే సెలబ్రేట్ చేశారు. ఈ వేడుకకు ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు పండిట్‌ రవి శంకర్‌, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, జీఆర్‌ గ్రూప్స్‌ అధినేత అమరనాథ రెడ్డి వంటి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా మోహన్ బాబు ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 


ముందుగా తన గురువు గారు దాసరి నారాయణరావుని గుర్తుచేసుకున్న మోహన్ బాబు.. తన జీవితమంతా కష్టాలమయమని ఎమోషనల్ అయ్యారు. తాను ఎంతోమందికి ఉపయోగపడ్డాను తప్ప ఎవరూ కూడా తనకు ఉపయోగపడలేదని.. అందరి చేతుల్లో ఎన్నో రకాలుగా మోసపోయానని, ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నానని చెప్పారు. దాదాపు ఏడేళ్ల పాటు తిండిలేక, రెండు జతల బట్టలతో కారు షెడ్ లో కాలం వెళ్లదీస్తూ బతికానని చెప్పారు. 


పొట్ట చేతపట్టుకొని దొంగ బండి ఎక్కి తిరుపతి నుంచి మద్రాస్ కు వెళ్లానని.. ఆ దేవుడు ఆశీస్సులతో దాసరి గారు మోహన్ బాబుగా తనను పరిచయం చేసినట్లు చెప్పారు. తన జీవితం ప్రతి క్షణం ముళ్లబాటగా ఉండేదని.. తను ఎదుర్కొన్న కష్టాల గురించి వెల్లడించారు. అసలు జీవితమంటే ఏంటో ఇప్పుడిప్పుడే తెలుస్తుందంటూ ఎమోషనల్ అయ్యారు. 


తనతో కొందరు రాజకీయనాయకులు ప్రచారం చేయించుకున్నారని.. తనకు మాత్రం ఎవరూ ఏదీ చేయలేదని అన్నారు. తను కూడా వాళ్ల సాయం కోరనని స్పష్టం చేశారు. ఏపీ టికెట్ రేట్లు, 'సన్నాఫ్ ఇండియా' రిలీజ్ సమయంలో రాజకీయాలను దూరంగా ఉంటానని మోహన్ బాబు చెప్పిన నేపథ్యంలో ఆయన చేసిన ఈ కామెంట్స్ వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.