తెలుగు సినీ ఇండస్ట్రీలో టాలెంట్ ను నమ్ముకొని పైకొచ్చిన యువ హీరోల్లో సందీప్ కిషన్ ఒకరు. వరుసగా సినిమాలు చేస్తున్నా అడపాదడపా సినిమాలు మాత్రమే పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంటున్నాయి తప్ప బ్లాక్ బస్టర్ లు రావట్లేదు. ఇండస్ట్రీలో ఇప్పటికీ బ్లాక్ బస్టర్ రాని యువ హీరోలు చాలామందే ఉన్నారు. వారిలో సందీప్ కిషన్ ఒకరు. ఇంతకు ముందు రిలీజ్ అయిన సందీప్ కిషన్ సినిమాలు కూడా అంతంత మాత్రం గానే ఆడాయి. అందుకే ఈసారి ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయిపోయినట్టున్నాడు సందీప్. ఈ మధ్య ఎక్కువ మంది హీరోలు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు సందీప్ కూడా పాన్ ఇండియా వైపే అడుగులు వేస్తున్నాడు. 'మైఖేల్' సినిమాను దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో రిలీజ్ చేస్తున్నాడు. రంజిత్ జయకోడి దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. ఈ మేరకు గురువారం టీజర్ విడుదల చేశారు.
తెలుగులో న్యాచురల్ స్టార్ నాని, తమిళ్ లో హీరో ధనుష్, కన్నడలో రక్షిత్ శెట్టి ఇలా ఒక్కో భాషలో ఒక్కో హీరో టీజర్ ను విడుదల చేయడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. టీజర్ లో సందీప్ కిషన్ లుక్స్ అదిరిపోయాయి. సందీప్ కిషన్ ను మునుపెన్నడూ చూడని విధంగా ఈ టీజర్ లో చూస్తారు ఆడియన్స్. టీజర్ లో సందీప్ సిక్స్ ప్యాక్ తో కనిపిస్తున్నాడు. టీజర్‌ను బట్టి చూస్తే ఈ సినిమా క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో సాగే కథలా అనిపిస్తుంది. విజువల్స్ లో కూడా ఓ కొత్తదనం కనబడుతోంది. డైలాగ్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అన్నీ అదిరిపోయాయి. టీజర్ మధ్యలో వచ్చిన డైలాగ్ ఓ రేంజ్ లో ఉంది. ‘‘మైఖేల్.. వేటాడటం రాని జంతువులే వేటాడే నోటికి చిక్కుతాయ్’’ అనే డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది. దానికి హీరో బదులు చెప్తూ.. "వెంటాడి ఆకలి తీర్చుకోడానికి.. వేటాడటం తెలియల్సిన పనిలేదు మాస్టార్" అని అంటాడు. అలాగే టీజర్ చివరలో ‘‘మన్నించేటప్పుడు మనం దేవుడవుతాం మైఖేల్’’ అనే డైలాగ్ కు కూడా హీరో బదులిస్తూ "నేను మనిషిగానే ఉంటా మాస్టార్" అని అంటాడు. ఈ డైలాగ్స్ సినిమా పై మరింత ఆసక్తి పెంచేలా ఉన్నాయి.
Also Read: సుమతో ఆడేసుకున్న అనుదీప్, శివ కార్తికేయన్ - ఆ పంచులకు నవ్వు ఆగదు!
ఇక ఈ సినిమా విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కరణ్ సీ ప్రొడక్షన్ల్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై నిర్మిస్తోన్న ఈ క్రైమ్, త్రిల్లర్ జోనర్ లో తమిళ్ యాక్టర్ విజయ్ సేతుపతి, గౌతమ్ మేనన్, వరుణ్ సందేశ్, వరలక్ష్మీ శరత్ కుమార్ లాంటి సీనియర్ నటీనటులు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. శామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్ లో వస్తోన్న ఈ సినిమా సందీప్ కిషన్ కు మంచి హిట్ ను అందిస్తుందో లేదో వేచి చూడాలి.