హీరో గోపిచంద్‌ నటించిన 'పక్కా కమర్షియల్'(Pakka Commercial) అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రాశిఖన్నా హీరోయిన్ గా నటించింది. అల్లు అరవింద్‌ సమర్పణలో జీఏ2 పిక్చర్స్‌-యూవీ క్రియేషన్స్‌ బ్యానర్లపై బన్నీవాసు ఈ సినిమాను నిర్మించారు. జూలై1, 2022న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 


దీంతో ప్రమోషన్స్ షురూ చేసింది చిత్రబృందం. తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) ముఖ్య అతిథిగా రానున్నట్లు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన స్పీచ్ తో ఆకట్టుకున్నారు.


''గోపీచంద్ నాన్నగారు టి.కృష్ణ అద్భుతమైన దర్శకులు. ఆయన ఒంగోలులో బీకామ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు నేను ఇంటెర్మీడియట్ ఫస్ట్ ఇయర్. ఆయన కాలేజ్ లో నన్ను చూసి పిలిపించారు. స్టూడెంట్ లీడర్ గా నేను నిలబడుతున్నా.. మీ సపోర్ట్ కావాలని అడిగారు. మా నుంచి ఎలాంటి సహకారమైనా ఉంటుందని చెప్పారు. అప్పట్లో ఆయన్ను చూసి చాలా ధైర్యంగా ఉండేది. నాలో ఉన్న భయాన్ని తీసేసి.. భరోసా ఇచ్చిన ఆయన్ను చూస్తుంటే హీరోలా కనిపించేవారు. ఇండస్ట్రీలోకి వచ్చిన తరువాత ఆయనతో కలిసి పని చేసే ఛాన్స్ రాలేదు. కానీ ఎన్నో రివల్యూషనరీ సినిమాలు తీశారాయన. ఆయన మనకి దూరమవ్వడం దురదృష్టకరం. హీరోగా గోపీచంద్ డిఫరెంట్ సినిమాలు చేస్తుంటారు. ఆయన నటించిన 'సాహసం', 'చాణక్య' లాంటి సినిమాలు నాకు బాగా నచ్చుతాయి. ఈ సినిమా ఆయన స్థాయి మరింత పెంచుతుంది. మారుతి 'ప్రజారాజ్యం' ఫ్లాగ్ ను డిజైన్ చేశారు. చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఆ పార్టీకి సంబంధించిన ఓ సాంగ్ కి విజువల్స్ కూడా ఆయనే తీశారు. ఆ టైంలోనే అతడిలో మంచి దర్శకుడు ఉన్నాడనిపించింది. ఆయన డైరెక్ట్ చేసిన సినిమాలన్నీ చాలా చక్కగా ఉంటాయి. ఆడియన్స్ పల్స్ తెలిసిన వ్యక్తి. 'పక్కా కమర్షియల్'లో అన్ని హంగులు ఉన్నాయనిపిస్తోంది. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. యువి క్రియేషన్స్ నిర్మాతలు వంశీ, విక్రమ్ నా ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాళ్లు. మారుతి దర్శకత్వంలో నేను హీరోగా వంశీ ఓ సినిమా అనుకున్నారు. ఆ సంగతి నాకు చెప్పినప్పుడు ఓకే అని చెప్పాను. అన్నీ కుదిరితే మారుతితో సినిమా ఉంటుంది. పక్కా కమర్షియల్ స్టేజ్ పై బేరం కుదురిపోయింది'' అంటూ సరదాగా అన్నారు మెగాస్టార్.