అక్కినేని నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం 'లవ్ స్టోరీ'. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన ఈ సినిమా సెప్టెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అథితులుగా మెగాస్టార్ చిరంజీవి, ఆమిర్ ఖాన్ హాజరయ్యారు. ముందుగా స్టేజ్ పైకి వెళ్లిన చిరు తనదైన స్పీచ్ తో ఈవెంట్ కి సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారారు.
చాలా రోజుల తరువాత ఇలా ఈవెంట్స్ జరగడం, నేరుగా అభిమానులను కలవడం, ఈ చప్పట్లు వింటుంటే ఆ కిక్కే వేరప్పా అంటూ.. స్పీచ్ మొదలుపెట్టిన చిరంజీవి.. లవ్ స్టోరీస్ చూసి చాలా కాలమైందని ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. తన మిత్రుడు నాగార్జున కొడుకు నాగచైతన్య.. వెరీ కూల్ బాయ్ అని.. యంగ్ స్టర్స్ అందరూ ఎగసిపడుతూ ఉంటారని.. కానీ చైతు చాలా కంపోజ్డ్ గా ఉంటాడని.. అలాంటి కూల్ ఫాదర్ కి కూల్ సన్ అంటూ చెప్పుకొచ్చారు. చాలా నిదానంగా, నిలకడగా వెళ్తుంటాడని.. అది ఇక్కడ సుదీర్ఘకాలం ఉండడానికి ఉపయోగపడుతుందని అన్నారు. తను ఎన్నుకునే కథలు, కాంబినేషన్ చాలా సెలెక్టివ్ గా ఉంటాయని చైతుని పొగిడారు.
ఇక హీరోయిన్ సాయి పల్లవి గురించి మాట్లాడుతూ చిరు చేసిన వ్యాఖ్యలు ఆకట్టుకున్నాయి. వరుణ్ తేజ్ సినిమాలో సాయి పల్లవిని చూశానని.. ఒక సాంగ్ లో తన బాడీ లాంగ్వేజ్, స్టెప్స్ చూస్తుంటే ఎవరీ అమ్మాయి. ఆ ఎనర్జీ ఏంటి అని స్టన్ అయిపోయానని చెప్పారు. ఆ తరువాత వరుణ్ తేజ్ వచ్చి 'డాడీ ఎలా చేశాను..' అని అడిగితే 'సారీరా నిన్ను చూడలేదు.. సాయి పల్లవిని చూస్తూ ఉండిపోయా..' అని చెప్పిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు చిరు. అయితే చిరంజీవి నెక్స్ట్ సినిమాలో సిస్టర్ రోల్ కోసం అడిగినప్పుడు సాయిపల్లవి నో చెప్పిందని.. ఆ విషయంలో హ్యాపీ ఫీల్ అయ్యానని అన్నారు చిరు.
సాయిపల్లవి లాంటి అమ్మాయితో కలిసి స్టెప్స్ వేయాలనుకుంటేనే కానీ సిస్టర్ రోల్స్ కాదంటూ కాసేపు సాయిపల్లవిని ఆట పట్టించారు. అది విన్న సాయిపల్లవి.. తను కావాలని సినిమా రిజెక్ట్ చేయలేదని.. రీమేక్ సినిమాలంటే భయమని చిరుకి చెప్పింది. మొత్తానికి వీరిద్దరి మధ్య ఈ సంభాషణ అభిమానులను ఆకట్టుకుంది. అనంతరం శేఖర్ కమ్ముల గురించి మాట్లాడుతూ.. ఆయన సినిమాలు యూనిక్ స్టైల్ లో ఉంటాయని.. చాలా క్లాస్ గా ఉంటాయని అన్నారు. ప్రతీ సినిమా ఒక క్లాసిక్ లా ఉంటుందన్నారు. ఈ సినిమా కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పారు.
ప్రభుత్వాలకు చిరు రిక్వెస్ట్..
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ 20% మాత్రమేనని దానికే చాలా పచ్చగా ఉంటుందని అందరూ అనుకుంటారని అన్నారు చిరు. కానీ ఇక్కడ కష్టపడే వాళ్లు లక్షల మంది ఉన్నారని చెప్పారు. వాళ్లంతా కలిస్తేనే ఇండస్ట్రీ అని.. షూటింగ్ లు ఆగిపోయేసరికి కార్మికులంతా ఎంత ఇబ్బంది పడ్డారో కళ్లారా చూశామని అన్నారు. డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ల అవసరాలు తీర్చగలిగామని చెప్పారు. ఇండస్ట్రీలో పచ్చదనం నిత్యం ఉండదని అన్నారు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు మా రిక్వెస్ట్ లను సానుకూలంగా స్పందించి పరిష్కార మార్గాలను చూపించాలని కోరారు. ఆశగా అడగట్లేదు.. అవసరం కోసం అడుగుతున్నామని చెప్పారు. సినిమాలు చేయాలా వద్దా అనే సందిగ్ధంలో చాలా మంది ఉండిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.