మాస్ మహరాజ్ రవితేజ లేటెస్ట్ సినిమా ‘ధమాకా’. ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం గురువారం సాయంత్రం విడుదల చేసింది. ట్రైలర్‌ను రవి తేజ ఫ్యాన్స్ కోరుకునే అంశాలతో ఫుల్ మాసీగా కట్ చేశారు. చాలా కాలం తర్వాత రవితేజ కామెడీ టైమింగ్ అద్భుతంగా పండటం ఇష్టం.
ఒకేలా ఉండే ఇద్దరు అబ్బాయిలనూ ప్రేమించే చిత్రమైన పాత్రలో హీరోయిన్ శ్రీలీలను చూపించారు. స్వామి, ఆనంద్ చక్రవర్తి అనే రెండు పాత్రల్లో రవితేజ కనిపించారు. స్వామి మిడిల్ క్లాస్ అబ్బాయి కాగా, ఆనంద్ చక్రవర్తి పెద్ద కంపెనీకి కాబోయే సీఈవో. ఇలా రెండు వైరుధ్యమైన పాత్రలతో ట్రైలర్ ఇంట్రస్టింగ్‌గా సాగుతుంది. నెల రోజుల్లో ఎలాగైనా 1,000 ఉద్యోగాలను ఇవ్వాలనేది ఆనంద్ చక్రవర్తి కోరిక కాగా, ఎలాగైనా నెల రోజుల్లోనే ఒక్క ఉద్యోగం సంపాదించాలనేది స్వామి అవసరం అన్నట్లు చూపించారు.
ఈ రెండు పాత్రల మధ్య తేడా, వారి మధ్య ఉండే ఫన్, యాక్షన్ నేపథ్యంలో సినిమా ఉండనుంది. నెగిటివ్ క్యారెక్టర్‌లో అల వైకుంఠపురంలో ఫేమ్ మేజర్ రవిచంద్రన్ కనిపించారు. డిసెంబర్ 23వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. నేను లోకల్, హలో గురూ ప్రేమ కోసమే ఫేమ్ త్రినాథరావు నక్కిన ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. భీమ్స్ సెసిరోలియో సంగీత దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాలో కామెడీ స్కిట్స్ ను 'జబర్దస్త్' కమెడియన్ హైపర్ ఆదితో రాయించారట. దర్శకుడు త్రినాథరావు, హైపర్ ఆది మంచి స్నేహితులు. ఇదివరకు త్రినాథరావు తన సినిమాలో రైటర్ ప్రసన్న కుమార్ ను బాగా ఇన్వాల్వ్ చేసేవారు. ఇప్పుడు హైపర్ ఆది సహాయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కథ ప్రకారం సినిమాలో కామెడీకి ఎక్కువ చోటుంది. ఆ కామెడీ ఎపిసోడ్స్ ను హైపర్ ఆదితో రాయించుకున్నట్లు తెలుస్తోంది.