2017లో మిస్ వరల్డ్ టైటిల్ కైవసం చేసుకుని ఒక్కసారిగా పాపులర్ అయ్యిది మానుషి చిల్లర్. హర్యానాకు చెందిన మానుషి 67వ ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకుంది. ఇండియా తరఫున ఈ కిరీటం అందుకున్న ఆరో బ్యూటీగా నిలిచింది. మిస్ వరల్డ్ టైటిల్ నెగ్గిన ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. అక్షయ్ కుమార్ తో కలిసి ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ అనే సినిమా చేసింది. అయితే, ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. నిజం చెప్పాలంటే బాక్సాఫీస్ దగ్గర బొక్కబోర్లా పడింది.
తెలుగులో ఛాన్స్ కొట్టేసిన మానుషి!
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో అడుగు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు, ఓ టాలీవుడ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. వరుణ్ తేజ్ హీరోగా శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ సినిమా కోసం తనను ఓకే చేసినట్లు తెలుస్తోంది. త్వరలో ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. వరుణ్ తేజ్ కెరీర్ లో 13వ సినిమాగా ఈ చిత్రం రూపొందబోతోంది. వచ్చే నెల నుంచి సినిమా షూటింగ్ మొదలుకానున్నట్లు తెలుస్తోంది. భారతీయ వాయుసేన కథాంశంతో, వాస్తవ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో వరుణ్ ఎయిర్ ఫోర్స్ అధికారికగా కనిపించనున్నాడు. సోని పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ సంస్థ ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తోంది. అటు ఈ సినిమాతో పాటు మానుషి ప్రస్తుతం ‘ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ’, ‘తెహ్రాన్’ అనే సినిమాల్లో నటిస్తోంది.
వ్యాపారవేత్తతో కామత్ తో మానుషి డేటింగ్
కాసేపు ఈమె సినిమాల గురించి పక్కన పెడితే ఆమెకు సంబంధించిన ఓ వార్త సినీ సర్కిల్స్ లో తెగ చక్కర్లు కొడుతోంది. వ్యాపారవేత్త నిఖిల్ కామత్ తో ఈమె డేటింగ్ చేస్తున్నట్లు సమాచారం. 2021 నుంచి వీరిద్దరు ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. మానుషి- నిఖిల్ చాలా కాలంగా ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నారట. ప్రస్తుతం మానుషి సినిమా కెరీర్ పై ఫుల్ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో తన ప్రేమ గురించి, వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటానికి ఇష్టపడటం లేదని తెలుస్తోంది. అంతేకాదు, వీరి ప్రేమ వ్యవహారం ఇరు కుటుంబ సభ్యులకు తెలుసట. అంతేకాదు, వారు వీరి పెళ్లికి కూడా అంగీకారం చెప్పినట్లు కొన్ని న్యూస్ పోర్టల్స్ వెల్లడిస్తున్నాయి.
పెళ్లై విడాకులు తీసుకున్న నిఖిల్ కామత్
వాస్తవానికి మానుషి- నిఖిల్ చాలా కాలంగా ప్రేమలో ఉండటంతో పాటు తరుచుగా ఇద్దరు కలిసి విహారయాత్రలకు వెళ్తున్నారు. తాజాగా ఈ జంట రిషికేష్ ను సందర్శించింది. అయితే, కామత్ కు ఇప్పటికే పెళ్లై విడిపోయాడు. 2019లో ఇటలీలోని ఫ్లోరెన్స్ లో అమండా పురవంకరను వివాహం చేసుకున్నారు. కేవలం ఏడాది కాలంలోనే వీరి సంసార జీవితానికి ఫుల్ స్టాప్ పడింది. 2021లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కామత్ మానుషితో డేటింగ్ చేస్తున్నాడట.