సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ప్రొడక్షన్ లో 'మేజర్' అనే సినిమాను రూపొందించారు. 26/11 ముంబై ఉగ్రదాడిలో అమరుడైన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా. ఇందులో ఆయన పాత్రను అడివి శేష్ పోషిస్తోన్న సంగతి తెలిసిందే.
'గూఢచారి' ఫేమ్ శశికిరణ్ తిక్క దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో అడివి శేష్ సరసన సయీ మంజ్రేకర్ నటించగా... కీలక పాత్రలో శోభితా దూళిపాళ్ల నటించింది. జూన్ 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల విడుదల చేసిన సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఇదిలా ఉండగా.. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన బిగ్గెస్ట్ అప్డేట్ ఒకటి బయటకొచ్చింది. అదేంటంటే.. ఈ సినిమా అనుకున్నదానికంటే ముందుగానే ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మే 24 నుంచి ప్రీరిలీజ్ ఫిల్మ్ స్క్రీనింగ్ పేరుతో సినిమాను ప్రదర్శించనున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం వెల్లడించింది. బుక్ మై షోలో ప్రీరిలీజ్ టికెట్స్ అవైలబుల్ గా ఉంటాయని తెలిపారు. సాధారణంగా ప్రీరిలీజ్ స్క్రీనింగ్ అంటే ఒకటి, రెండు రోజుల ముందు నుంచి ఉంటుంది. కానీ ఈ సినిమా విషయంలో పది రోజులు ముందుగానే స్క్రీనింగ్ చేయబోతున్నారు.
ఈ సినిమాను మహేష్ బాబుతో పాటు సోనీ పిక్చర్స్, ఎ+ఎస్ మూవీస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు అబ్బూరి రవి మాటలు రాశారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. 'మేజర్'ను పాన్ ఇండియా లెవల్‌లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రేవతి, మురళీ శర్మ ఇతర ప్రధాన తారాగణం.
Also Read: ఎన్టీఆర్ బర్త్ డే వేడుకల్లో వంశీ పైడిపల్లి - క్రేజీ రూమర్స్ షురూ
Also Read: మహేష్ బాబుతో 'విక్రమ్' డైరెక్టర్ మీటింగ్ - విషయమేంటో?