Rashmika Deep Fake Video  డీప్‌ ఫేక్‌ వీడియో.. సోషల్‌ మీడియాలో అప్పట్లో ఆందోళన కలిగించింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజన్స్‌కి సంబంధించి ఆందోళన నెలకొంది ఆ వీడియో చూసిన తర్వాత. కాగా.. ఇప్పుడు ఆ కేసులో కీలక విషయం చోటు చేసుకుంది. వీడియోను క్రియేట్‌ చేసిన వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీడియో సృష్టించిన ప్రధాన నిందితుడిని ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వ్యక్తిగా గుర్తించిన ఢిల్లీ పోలీసులు.. ఆంధ్రప్రదేశ్‌కి వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 


నటి రష్మిక మందన్నా డీప్‌ఫేక్ వీడియో దేశవ్యాప్తంగా అప్పట్లో వివాదం సృష్టించింది.గతేడాది నవంబర్‌ 2023లో రష్మికాకి చెందిన ఒక వీడియో వైరల్‌ అయ్యింది. బ్రిటిష్‌ - ఇండియన్‌, సోషల్‌ మీడియా ఇన్‌ఫ్ల్యూయన్సర్‌ జరాపటేల్‌ వీడియోకి రష్మికా ముఖాన్ని పెట్టి మార్ఫింగ్‌ చేశారు. ఆ వీడియో చూసిన చాలామంది అది రష్మికా వీడియో అనుకున్నారు. కానీ అది ఏఐ ద్వారా మార్ఫింగ్‌ చేసిన వీడియో కావడంతో అప్పట్లో దానిపై కేసు నమోదు చేశారు ఢిల్లీ పోలీసులు. ఇండియన్ పీనల్ కోడ్, 1860లోని సెక్షన్లు 465 (ఫోర్జరీ), 469, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలోని సెక్షన్లు 66C,66E కింద కేసు నమోదు చేశారు.


ఈ కేసుకు సంబంధించి కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ వేగవంతం చేశారు. దాంట్లో భాగంగా గతంలో బీహార్‌కి చెందిన 19 ఏళ్ల యువకుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. ఇక ఇప్పుడు కీలక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.నిందిత యువకుడి సోషల్‌ మీడియా ఖాతా నుండే అప్‌లోడ్‌ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో షేర్‌ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. 


ఇక ఆ తర్వాత ఎంతో మంది సెలబ్రిటీలు ఈ డీప్‌ ఫేక్‌ వీడియోల బారినపడ్డారు. సచిన్‌ కూతురు సారా తెండుల్కర్‌, కత్రినాకైఫ్, కాజోల్ తదితరుల వీడియోలు బయటికి వచ్చాయి. ఇక నిన్నటికి నిన్న సోనూసూద్‌ వీడియో కూడా ఒకటి బయటికి వచ్చింది. ఆయన డీప్‌ఫేక్‌ వీడియో సృష్టించిన సైబర్‌ నేరగాళ్లు డబ్బులు అడుగుతున్నారని, దయచేసి నమ్మొద్దు అంటూ సోనూసూద్‌ స్వయంగా చెప్పుకొచ్చారు. 


టెక్నాలజీ పెరగడం వల్ల ఎన్ని లాభాలు ఉంటాయో అన్ని నష్టాలు ఉంటాయి. దానికి ఉదాహరణ ఈ డీప్‌ఫేక్‌ వీడియో. ఇక రష్మిక వీడియో రిలీజ్‌ అయిన తర్వాత ఎంతోమంది సెలబ్రిటీలు దీనిపై స్పందించారు. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అయితే దీనిపై స్పందించిన కేంద్ర ఐటీ శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా ఐటీ చట్టంలో కఠిన నిబంధనలు తీసుకువస్తామని చెప్పారు.