Guntur Kaaram Mawaa Enthaina Lyrical Song: మహేష్ బాబు, శ్రీలీల జంటగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గుంటూరు కారం’. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రమోషనల్ కార్యక్రమాలు ఊపందుకున్నాయి. ఈ సినిమా మీద కొన్ని విమర్శలు వచ్చినా, ప్రస్తుతం మంచి బజ్ ఏర్పడింది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా మరో మాస్ లిరికల్ సాంగ్ ను విడుదల చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ పాట ప్రేక్షకులను బాగా అలరిస్తోంది. సినిమాపై మరిన్ని అంచనాలను పెంచింది.
మాస్ స్టెప్పులతో దుమ్మురేపిన మహేష్ బాబు
‘గుంటూరు కారం’ మూవీ నుంచి ‘మావా ఎంతైనా‘ అనే లిరికల్ సాంగ్ ను విడుదల చేసింది చిత్రబృందం. మిర్చి గో డౌన్ తెరకెక్కించిన ఈ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ పాట ప్రారంభంలో మీనాక్షి చౌదరి అచ్చ తెలుగు అమ్మాయిలా అందిరికీ మంగళ హారతి ఇస్తూ కనిపిస్తుంది. మహేష్ బాబు ఏదో బాధలో ఉన్నట్లు కనిపిస్తాడు. ఆమె ఇచ్చిన హారతిని కూడా తీసుకోడు. అదే సమయంలో గ్రామ్ ఫోన్ రికార్డు నుంచి పాటలు వినిపిస్తాయి. సత్యం గారి గ్రామ్ ఫోన్ రికార్డు ఇక్కడికి తెచ్చారేంటి? అంటారు మహేష్ బాబు. అప్పుడు పాట మొదలవుతుంది. ‘మావా ఎంతైనా ఫర్లేదు పిల్లో, మనసు బాలేదు వేసేస్తా ఫుల్లు’ అంటూ మాస్ షురూ అవుతుంది. మహేష్ బాబు ఈ పాటలో గతంలో ఎప్పుడూ లేని విధంగా కనిపించారు. మాస్ స్టెప్పులతో ఆకట్టుకున్నాడు. అమ్మాయితో బ్రేకప్ అయిన బాధలో ఆయన ఈ పాట పాడినట్లు తెలుస్తోంది. ఈ పాటకు హరిరామ జోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా, శ్రీకృష్ణ, రమణా చారి అద్భుతంగా ఆలపించారు. తమన్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ పాటను చూసి మహేష్ అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమాలో కొత్త మహేష్ ను చూడబోతున్నట్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
హ్యాట్రిక్ హిట్ కొట్టాలని భావిస్తున్న మహేష్, త్రివిక్రమ్
ఇక ఇప్పటికే 'అతడు', 'ఖలేజా' సినిమాతో మంచి విజయాలను అందుకున్న మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో ఇప్పుడు 'గుంటూరు కారం' విడుదల కాబోతోంది. కచ్చితంగా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని సూపర్ స్టార్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. గతంలో ఎప్పులేని రీతిలో మహేష్ ను త్రివిక్రమ్ ఈ సినిమా చూపించబోతున్నారు. ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. రమ్యకృష్ణ, ప్రకాష్‌రాజ్, జగపతిబాబు కీలక పాత్రలు పోషించారు. హాసిని, హారిక క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ నిర్మించగా, తమన్ సంగీతం అందించారు.
Read Also: హీరోయిన్ అసిన్ ఇప్పుడు ఏం చేస్తోంది? ఆమె భర్త ఆదాయం ఎంతో తెలిస్తే కళ్లు తేలేయడం ఖాయం