హిందీ సినిమా ఎప్పుడు చేస్తారు? పాన్ ఇండియా సినిమా చేసే ఉద్దేశం ఉందా? వంటి ప్రశ్నలు సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కు ఎదురు అయ్యేవి. ''తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి ఎదిగినప్పుడు హిందీ లేదా పాన్ ఇండియా సినిమా చేయడం ఎందుకు? తెలుగు సినిమా చేసి హిందీలో విడుదల చేస్తా'' అని ఆయన బదులు ఇచ్చేవారు. అయితే... 'ఈగ', 'బాహుబలి', 'సైరా నరసింహా రెడ్డి', 'ఆర్ఆర్ఆర్' తరహాలో మహేష్ సినిమాలు హిందీలో, ఇతర భాషల్లో భారీ ఎత్తున విడుదల కాలేదు. ఇప్పుడు త్రివిక్రమ్ సినిమా ఆ లోటు తీర్చనుంది. 


ఐదు భాషల్లో మహేష్ సినిమా
మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) తో మహేష్ హ్యాట్రిక్ సినిమాకు రెడీ అయ్యారు. 'అతడు', 'ఖలేజా' సినిమాల తర్వాత మరోసారి మహేష్ హీరోగా త్రివిక్రమ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. 


మహేష్ బాబు, త్రివిక్రమ్ తాజా సినిమా డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్నట్లు ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌ వెల్లడించింది. థియేట్రికల్ విడుదల తర్వాత తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాను తమ ఓటీటీ వేదికలో విడుదల చేయనున్నట్లు తెలియజేసింది. దాంతో ఇది పాన్ ఇండియా సినిమా అనే క్లారిటీ వచ్చింది. భారీ రేటుకు నెట్‌ఫ్లిక్స్‌కు రైట్స్ ఇచ్చినట్లు టాక్. 


Also Read : వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య... పుచ్చకాయల్ని కోసినట్లు తలలు తెగేలా నరికేయడం హీరోయిజమా? 






రాజమౌళి దర్శకత్వంలో పాన్ వరల్డ్ సినిమా
త్రివిక్రమ్ సినిమా తర్వాత దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్‌లో కూడా ఆ సినిమా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారని టాక్. గ్లోబ్ ట్రాట్ కాన్సెప్ట్ అని ఆల్రెడీ చెప్పేశారు. మహేష్ క్యారెక్టర్ జేమ్స్ బాండ్ తరహాలో ఉంటుందని వినికిడి. ఆ సినిమా కంటే ముందు త్రివిక్రమ్ సినిమాతో పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు మహేష్ వెళ్లనున్నారు.  


Also Read : విలన్‌కు హీరోయిన్‌ ఛాన్స్‌ - బాలకృష్ణ ప్రామిస్ 


వచ్చే వారం నుంచి నాన్ స్టాప్‌గా!
వచ్చే వారమే మహేష్, త్రివిక్రమ్ సినిమా షూటింగ్ స్టార్ట్ కానుంది. జనవరి నుంచి SSMB 28 సెట్స్ మీదకు వెళుతుందని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థ గత నెలలో పేర్కొంది. నాన్ స్టాప్‌గా షూటింగ్ చేస్తామని తెలియజేసింది. చిత్రీకరణకు అంతా సిద్ధమైందని, హుషారుగా సెట్స్‌లో అడుగు పెడతామని పేర్కొంది. ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు.


హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వేసవిలో సినిమా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. 'మహర్షి' తర్వాత మరోసారి మహేష్ బాబు సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. 'అరవింద సమేత వీర రాఘవ', 'అల... వైకుంఠపురములో' సినిమాల తర్వాత ముచ్చటగా మూడోసారి త్రివిక్రమ్ దర్శకత్వంలో ఆమె నటిస్తున్న చిత్రమిది. 


మహేష్, త్రివిక్రమ్ సినిమాకు ఎస్.ఎస్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఒక సమయంలో ఆయన్ను సినిమా నుంచి తప్పించారని వార్తలు వచ్చాయి. కానీ, వాటిలో నిజం లేదని చిత్ర బృందం క్లారిటీ ఇచ్చింది. ఈ చిత్రానికి కూర్పు: నవీన్ నూలి, కళా దర్శకత్వం: ఏ.ఎస్. ప్రకాష్, ఛాయాగ్రహణం: పి.ఎస్. వినోద్.