ఇప్పుడు మహేష్ బాబు (Mahesh Babu) పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. ప్రాణం కంటే ఎక్కువగా అభిమానించే తండ్రిని కోల్పొయిన బాధలో ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణ మరణం, కొన్ని రోజుల క్రితం తల్లి ఇందిరా దేవి మరణం, జనవరిలో అన్న రమేష్ బాబు మరణం... ఒక్క ఏడాదిలో ముగ్గురు ఆప్తుల్ని ఆయన కోల్పోయారు. ఇంత బాధలో ఉన్న ఆయన... అభిమానులు ఎవరూ ఖాళీ కడుపుతో వెళ్ళకూడదని తీసుకున్న నిర్ణయం ప్రజల మనసులు గెలుచుకుంది.
 
కృష్ణను చూడటానికి వచ్చిన అభిమానులకు భోజనాలు
సూపర్ స్టార్ కృష్ణను కడసారి చూసేందుకు, ఆయన అంత్యక్రియలకు (Krishna Final Rites) హాజరు అయ్యేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు, దేశంలో ఇతర నగరాల నుంచి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. పద్మాలయ స్టూడియో దారులు అభిమానులతో నిండిపోయాయి. తన తండ్రి ఆఖరి చూపు కోసం వచ్చిన అభిమానులు ఎవరికీ అసౌకర్యం కలగకూడదని తమ సిబ్బందికి మహేష్ బాబు సూచించారని తెలిసింది. అంత విషాదంలో ఉన్నా సరే అభిమానుల కోసం ఆయన భోజనాలు ఏర్పాటు చేయించారు. మహేష్ చేసిన పనిని అభిమానులే కాదు, సామాన్య ప్రేక్షకులు సైతం అభినందిస్తున్నారు.


ఇప్పుడు మహేష్...
అప్పుడు ప్రభాస్!
కృష్ణంరాజు మరణించిన తర్వాత ఆయన స్వగ్రామమైన మొగల్తూరులో సంస్మరణ సభ నిర్వహించారు. దానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలి వచ్చారు. వాళ్ళకు ప్రభాస్ భోజనాలు పెట్టించారు. దానికి సుమారు నాలుగు కోట్లు ఖర్చు చేసినట్టు సమాచారం. 


Also Read : ఓ తరం వెళ్ళిపోయింది - ఎన్టీఆర్, ఏయన్నార్, శోభన్ బాబు, కృష్ణంరాజు, ఇప్పుడు కృష్ణ






నటశేఖరుడికి తెలుగు ప్రజానీకం కన్నీటి నివాళి అర్పించింది. ఐదు దశాబ్దాల పాటు సాగిన నట ప్రయాణంలో 350కు పైగా సినిమాలు చేసి, ప్రేక్షకులను తనదైన నటనతో అలరించిన సూపర్ స్టార్ కృష్ణ (Super Star Krishna) ను కడసారి చూసేందుకు చిత్రసీమ ప్రముఖులు, ప్రేక్షకులు, మరీ ముఖ్యంగా అభిమానులు హైదరాబాద్ ఫిల్మ్ నగర్‌లో గల పద్మాలయ స్టూడియోకు తరలి వచ్చారు.


ఈ రోజు (బుధవారం) మధ్యాహ్నం పద్మాలయ స్టూడియో నుంచి మహాప్రస్థానానికి కృష్ణ అంతిమ యాత్ర మొదలైంది. దారి పొడవునా ఆయనకు వేలాది సంఖ్యలో హాజరైన ప్రజలు, అభిమానులు నీరాజనం పలికారు. 'కృష్ణ అమర్ రహే' అంటూ నినాదాలతో దారి అంతా మారుమ్రోగింది. మహాప్రస్థానం చేరిన తర్వాత తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. తండ్రికి మహేష్ బాబు కొరివి పెట్టారు.  






కుటుంబాన్ని, అభిమానులను, తెలుగు సినిమాను ఒంటరి చేస్తూ... ఈ లోకాన్ని విడిచి పైలోకాలకు మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల ప్రాంతంలో కృష్ణ వెళ్లారు. హైదరాబాద్ కాంటినెంటల్ ఆస్పత్రి నుంచి ఆయన పార్థీవ దేహాన్ని నానక్‌రామ్ గూడాలోని విజయ నిర్మల నివాసానికి తీసుకు వెళ్లారు. ఆ తర్వాత అభిమానుల సందర్శనార్ధం నేటి ఉదయం వరకు అక్కడే ఉంచారు. ఈ రోజు ఉదయం విజయ నిర్మల నివాసం నుంచి పద్మాలయ స్టూడియోకు తీసుకు వచ్చారు. అక్కడ నుంచి మహాప్రస్థానానికి అంతిమ యాత్ర మొదలైంది. 


కృష్ణ మరణం తెలుగు చలన చిత్ర పరిశ్రమకు తీరని లోటు అని ప్రముఖులు కొనియాడారు. తెలుగు సినిమాలో ఎన్నో ప్రయోగాలకు ఆయన ఆద్యుడు అని, తెలుగు సినిమా ఉన్నతికి ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. కృష్ణ మరణంతో తెలుగు సినిమాలో ఓ తరం ముగిసింది. తొలి తరం హీరోలైన ఎన్టీఆర్, ఏయన్నార్, కృష్ణంరాజు, శోభన్ బాబు, ఇప్పుడు కృష్ణ... లోకాన్ని విడిచి వెళ్లారు.