బాలీవుడ్ అగ్ర నటుడు అమీర్ ఖాన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. కొంత కాలం పాటు సినిమాలకు దూరంగా ఉండబోతున్నట్లు వెల్లడించారు. ‘లాల్ సింగ్ చద్దా’ చిత్రం ఘోర పరాజయం పొందిన తర్వాత తొలిసారి ఆయన మీడియా ముందుకు వచ్చారు. తన కెరీర్ లో తొలిసారి నటనకు విరామం ప్రకటిస్తున్నట్లు చెప్పారు. వాస్తవానికి అమీర్ ఖాన్ నటించి చివరి ఫ్లాప్ సినిమా ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’. ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కినా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఆ సినిమా వచ్చిన మూడు సంవత్సరాల తర్వాత ‘లాల్ సింగ్ చద్దా’ రిలీజ్ అయ్యింది. ఈ సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలింది. బాయ్ కాట్ కాంపెయిన్ దెబ్బకు జనాలు లేక థియేటర్లు వెలవెలబోయాయి. కలెక్షన్లు లేక సినిమా థియేటర్ల ఓనర్లు ఈ చిత్రాన్ని ఎత్తేశారు.


హీరో నుంచి నిర్మాతగా!


నటనకు విరామం ప్రకటిస్తున్నట్లు చెప్పిన అమీర్ ఖాన్..  ఓ సినిమాను నిర్మించబోతున్నట్లు వెల్లడించారు. ‘ఛాంపియన్స్’ పేరుతో ఓ సినిమాను నిర్మించనున్నట్లు ప్రకటించారు. తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ ఈవెంట్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. వాస్తవానికి ‘లాల్ సింగ్ చద్దా’ తర్వాతే ‘ఛాంపియన్స్’ షూటింగ్ కొనసాగాల్సి ఉండేది.. అయితే, తాను నటనకు కొద్ది రోజులు బ్రేక్ ఇవ్వాలని భావిస్తున్నట్లు చెప్పారు.  అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్ ఇండియా, 200 నాటౌట్ ప్రొడక్షన్స్ కలిసి ‘ఛాంపియన్స్‌’ సినిమాను నిర్మిస్తున్నాయి.


నటనకు విరామం ప్రకటిస్తున్నా!


“నేను నటుడిగా సినిమాలు చేస్తున్నా, కుటుంబ జీవితాన్ని చాలా వరకు నష్టపోతున్నాను. అందుకే నేనో కీలక నిర్ణయం తీసుకుంటున్నాను.  కొంత కాలం పాటు నా కుటుంబంతో గడపాలి అనుకుంటున్నాను. నటనకు కాస్త బ్రేక్ ఇస్తున్నాను. మా అమ్మతో, నా పిల్లలతో గడపబోతున్నాను. నేను 35 ఏళ్లుగా సినిమా పరిశ్రమ కోసమే పని చేస్తున్నాను. సినిమాలపై  దృష్టి పెట్టాను. ఈ నేపథ్యంలో  కొంత కాలం నటనకు విరామం ప్రకటిస్తున్నాను” అని అమీర్ ఖాన్ తెలిపారు. "ఏడాదిన్నర పాటు నటనకు దూరంగా ఉండాలని భావిస్తున్నాను. నటుడిగా పని చేయకపోయినా, నిర్మాతగా పని చేయబోతున్నాను. ‘ఛాంపియన్స్’ కోసం వర్క్ చేస్తాను” అని అమీర్ వెల్లడించాడు.   


‘లాల్ సింగ్ చద్దా’ పరాభావానికి కారణాలెన్నో!


టామ్ హాంక్స్ హాలీవుడ్ క్లాసిక్ 'ఫారెస్ట్ గంప్'కి బాలీవుడ్ రీమేక్ గా 'లాల్ సింగ్ చద్దా' తెరకెక్కింది. ఈ చిత్రంలో అమీర్ తో పాటు కరీనా కపూర్,  మోనా సింగ్, మానవ్ విజ్, నాగ చైతన్య, అద్వైత్‌ కీలక పాత్రలు పోషించారు. చందన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ ఏడాది ఆగస్టులో విడుదలైంది. భారీ బడ్జెట్ మరియు ప్రమోషన్ ఉన్నప్పటికీ, ఈ చిత్రం చాలా ఘోరంగా పరాజయం పాలైంది. అమీర్ ఖాన్ గతంలో చేసిన కొన్ని వ్యాఖ్యలు, తన PK చిత్రంలో హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా చూపించడం ఈ సినిమాపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత మొదలైన బాయ్ కాట్ ఆందోళన కూడా ఈ సినిమా పరాభవానికి కారణం అయ్యింది.