అందాల తార మృణాల్ ఠాకూర్ తెలుగుతో పాటు బాలీవుడ్ లోనూ రాణిస్తోంది. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లతోనూ ఆకట్టుకుంటోంది. మృణాల్ ఇప్పటికే పలు బాలీవుడ్ చిత్రాలతో పాటు తెలుగులోనూ సినిమాలు చేసింది. అయితే, ‘సీతారామం’ తర్వాతే మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందంతో పాటు అభినయంతో  ఆకట్టుకుంది. ఈ సినిమా పాన్ ఇండియా రేంజి విజయాన్ని అందుకోవడంతో వరుస ఆఫర్లు లభిస్తున్నాయి. సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ లోనూ పలు ప్రాజెక్టులలో నటిస్తోంది.  


'మేడ్ ఇన్ హెవెన్ 2'లో నటనకు విమర్శకుల ప్రశంసలు   


గత కొద్దికాలంగా మృణాల్ ఓటీటీలో బాగానే రాణిస్తోంది. ‘లస్ట్ స్టోరీస్ 2'లో తన అందాల విందుతో హీట్ పెంచిన ఆమె ఇటీవల 'మేడ్ ఇన్ హెవెన్ 2'లో కనిపించింది. జోయా అక్తర్ రూపొందించిన ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో విడుదల అయ్యింది. గత వారం అందుబాటులోకి వచ్చిన 'మేడ్ ఇన్ హెవెన్ 2'  మంచి ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఇందులో శోభితా ధూళిపాళ్ల ప్రధానపాత్రలో నటించింది. ఈ సిరీస్ లో మృణాల్  సమస్యలతో కూడిన గృహిణి పాత్ర పోషించింది. ఎన్నో ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ఓ వ్యక్తిని తను పెళ్లి చేసుకుంటుంది. ఆ తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఈ పాత్రలో ఆమె చక్కటి అభినయంతో ఆకట్టుకుంది. ఆమె నటనకు విమర్శకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు. 


వరుస సినిమాలు చేస్తున్న మృణాల్ ఠాకూర్


కొత్త దర్శకుడు శౌర్యువ్‌ రూపొందిస్తున్న ‘హాయ్ నాన్న’  చిత్రంలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తోంది. నాని హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శృతిహాసన్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది.  వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి (సివిఎం), డా. విజయేందర్ రెడ్డి తీగల ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ‘హృదయం’ ఫేమ్ హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అదిస్తుండగా,  సాను జాన్ వరుగీస్ సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ లో 5 భాషల్లో థియేటర్లలో విడుదల కాబోతోంది.  పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ రాబోయే చిత్రంలో కూడా ఆమె హీరోయిన్ గా నటిస్తోంది.  త్వ‌ర‌లోనే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్‌  ప్రారంభించనున్నారు.  ప్రముఖ నిర్మాత 'దిల్' రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రం రూపొందుతోంది. ఇటీవలే పూజా కార్యక్రమాలతో ఈ మూవీని లాంఛనంగా ప్రారంభించారు. తెలుగులో ఆమెకు ఇది మూడో సినిమా కాగా,  విజయ్ దేవరకొండతో, 'దిల్' రాజు నిర్మాణంలో మొదటి సినిమా.  అటు శివ కార్తికేయన్ చిత్రంతో తమిళంలో అడుగుపెట్టడానికి సిద్ధం అవుతోంది.






Read Also: ‘ఖుషి’ మ్యూజికల్‌ కాన్సెర్ట్‌ లో సమంత, విజయ్ రచ్చ-ఓ రేంజిలో ఆటాడేసుకుంటున్న నెటిజన్లు


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial