MAA Elections Live Updates: మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ఘన విజయం
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తెల్లవారుజామునే మా ఎన్నికల్లో తలపడుతున్న మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు వారబ్బాయి అనుకున్నది సాధించారు. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం సాధించారు. ప్రకాష్ రాజ్‌పై 400 ఓట్ల భారీ ఆధిక్యంతో విష్ణు గెలుపొందినట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
మా ఎలక్షన్ కౌంటింగ్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. మంచు విష్ణు ప్యానల్ సభ్యులు మరొకరు విజయం సాధించారు. జనరల్ సెక్రటరీగా ప్రకాష్ రాజ్ ప్యానల్‌కు చెందిన జీవితా రాజశేఖర్‌పై 7 ఓట్ల తేడాతో విష్ణు ప్యానల్ సభ్యుడు రఘుబాబు గెలుపొందారు.
మా ఎన్నికల్లో ట్రెజరర్‌గా శివ బాలాజీ విజయం సాధించారు. మంచు విష్ణు ప్యానల్ నుంచి పోటీ చేసిన శివ బాలాజీ.. ప్రకాష్ రాజ్ ప్యానల్ అభ్యర్థి నాగినీడుపై గెలుపొందారు
మా ఎలక్షన్స్ జరుగుతున్న సమయంలో విష్ణు ప్యానెల్ సభ్యుడు శివబాలాజీ చేతిపై నటి హేమ కొరికారు. ఎన్నికలు పూర్తయిన తరువాత సాయంత్రం చికిత్స కోసం నిమ్స్ ఆస్పత్రికి శివబాలాజీ వెళ్లాడు. ఆమె తనను ఎందుకు కొరికిందో ఇప్పటికీ తెలియదన్నాడు. ఎలక్షన్ పక్కదారి పట్టకూడదనే ఉద్దేశంతో ఉదయం కొరికిన తరువాత తాను గొడవకు దిగలేదని చెప్పాడు. టీటీ చేయించుకున్నానని, డాక్టర్లు యాంటీ బయాటిక్స్ ఇచ్చారని శివబాలాజీ తెలిపాడు.
మా ఎలక్షన్ కౌంటింగ్ మొదలైంది. నేటి ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 వరకు ఉత్కంఠభరితంగా మా ఎన్నికలు జరిగాయి. సీనియర్ నటులు మురళీమోహన్, మోహన్ బాబుల సమక్షంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరగనున్నట్లు సమాచారం. పలువురు టాలీవుడ్ అగ్ర నటీనటులు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు ముగిశాయి. గత ఎన్నికలతో పోల్చితే భారీగా పోలింగ్ జరిగింది. ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్ 3 గంటలకు ముగిసింది. 600కు పైగా ఓట్లు పోలైనట్లు తెలుస్తోంది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలిపి 700 దాటే అవకాశం ఉందని సమాచారం.
'మా' ఎన్నికల్లో భాగంగా అఖిల్, సుధీర్‌బాబు, నటి అనుపమ పరమేశ్వరన్‌లు ఓటు వేశారు. ఓటు వేసేందుకు వచ్చిన సినీతారలను చూసేందుకు అభిమానులు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌కు భారీగా తరలివచ్చారు. నటీనటులతో సెల్ఫీలు తీసుకునేందుకు జనం ఎగబడ్డారు. ఈ కారణంగా పోలీసులు లాఠీ ఛార్జీ చేయాల్సి వచ్చింది.
మధ్యాహ్నం 2గంటలతో ముగియనున్న ‘మా’ ఎన్నికల పోలింగ్‌ను మరో గంట పాటు పొడిగించారు. దీనిపై ఇరు ప్యానెళ్లతో ఎన్నికల అధికారులు చర్చించారు. ఇరువురు ఒప్పుకొన్నారు. దీంతో ‘మా’ ఎన్నికల పోలింగ్ 3 గంటల వరకూ కొనసాగనుంది.
జీవితంలో ఎప్పుడైనా, ఎక్కడైనా పోటీ ఉంటే దాని ఫలితం వేరుగా ఉంటుందని సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. 'మా' ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత మాట్లాడారు. మా ఎన్నికల్లో పోటీ తనతోనే మొదలైందని అన్నారు. ఈ పోటీలో ఎవరు గెలిచినా, తమలో ఒకరే కదానని అన్నారు.
‘మా’ ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్త నెలకొంది. లోపల ప్రచారం చేస్తున్నారంటూ.. ఇరు వర్గాల మధ్య వాగ్వాదం నడిచింది. గేటు బయట ప్రచారం చేసుకోవాల్సిందిగా వాగ్వాదానికి దిగారు. శివబాలాజీ-హేమల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. కాసేపు పోలింగ్ ను ఎన్నికల అధికారులు నిలిపివేశారు. మరోవైపు రిగ్గింగ్ చేస్తున్నారంటూ.. ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎన్నికల అధికారి సీసీ టీవీ ఫుటేజీని ఎన్నికల అధికారి పరిశీలిస్తున్నారు.
మా ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఎన్నికల్లో మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణ ఓటు వేశారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు సినీ నటులు పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు.
'మా' ఎన్నికల్లో సినీ నటుడు రామ్‌చరణ్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సుమ, శ్రీకాంత్, నరేశ్, శివాజీరాజా, ఉత్తేజ్, శివబాలాజీ, సుడిగాలి సుధీర్, రాఘవ తదితరులు ఓటు వేశారు. మా ఎన్నికలో ఓటు వేసిన తర్వాత సాయి కుమార్ మాట్లాడారు. ఎవరు గెలిచినా 'మా' గెలిచినట్టేనని సాయి కుమార్ అన్నారు. షూటింగ్స్‌తో బిజీగా ఉండటంతో పోటీ చేయలేకపోయినట్లు చెప్పారు. లోకల్, నాన్-లోకల్ కాదు తాను నేషనలిస్ట్ అని సాయి కుమార్ అన్నారు.
'మా' ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. సినీ నటులు పవన్‌కల్యాణ్, మోహన్‌బాబు, పోసాని కృష్ణమురళి, సాయికుమార్, మంచు లక్ష్మీ, వడ్డే నవీన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అటు మంచు విష్ణు ప్యానెల్, ఇటు ప్రకాశ్‌రాజ్ ప్యానెల్ సభ్యులు ఉదయం నుంచి పోలింగ్ కేంద్రం వద్దే ఉన్నారు. ఓటు వేయడానికి వచ్చిన వారితో ఇరు వర్గాల వారు సరదాగా మాట్లాడారు.
మా పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ప్రకాష్ రాజ్ ప్యానెల్ మెంబర్స్ తీరుపై మంచు విష్ణు ప్యానెల్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలింగ్ బూత్‌లో నమూనా బ్యాలెట్ పేపర్‌ను శివా రెడ్డి పలువురికి ఇవ్వడాన్ని నటుడు శివబాలాజీ అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే మాటా మాటా పెరిగింది. దీంతో పోలీసులు జోక్యం చేసుకొని ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు.
‘మా’ ఎన్నికలలో ఓటు వేసేందుకు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు పోలింగ్ కేంద్రానికి చేరుకుంటున్నారు. కాసేపటి క్రితం పవన్ కళ్యాణ్ ఓటు వేసేందుకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఆయన్ను చుట్టుముట్టగా.. ఆయన స్పందించారు. ఈ ఎన్నికలకు ఇంత హడావిడి అవసరం లేదని వ్యాఖ్యానించారు. సినీ ఇండస్ట్రీ చీలడమనే ప్రశ్నే లేదని.. వ్యక్తిగత దూషణలు అనవసరమని అన్నారు. ఈ స్థాయిలో ఎన్నికలు జరగడం ఎప్పుడు చూడలేదని అన్నారు. మోహన్ బాబు, చిరంజీవి ఎప్పటికీ మంచి స్నేహితులుగానే ఉంటారని పవన్ కల్యాణ్ అన్నారు.
‘మా’ ఎన్నికల పోలింగ్ ప్రారంభం అయింది. నగరంలోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్‌లోని 3 క్లాస్ రూముల్లో పోలింగ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2 గంటల వరకు ఓటింగ్ జరుగుతుంది. సాయంత్రం 4 గంటలకు ఓట్ల లెక్కింపు మొదలుపెడతారు. అనంతరం రాత్రి 8 గంటలకు విజేతలెవరనేది ప్రకటిస్తారు.
‘మా’ ఎలక్షన్స్ ప్రారంభానికి కొద్దిసేపటి ముందు ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు కలిశారు. మోహన్ బాబు.. ఈ ఇద్దరి చేతులని కలిపారు. అనంతరం మంచు విష్ణు- ప్రకాశ్ రాజ్ ఆలింగనం చేసుకున్నారు. ఈ సన్నివేశాలు అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాయి. నిన్నటి వరకూ ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్న ఇరు వర్గాలు ఇలా కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
Background
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. తెల్లవారుజామునే మా ఎన్నికల్లో తలపడుతున్న మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్ పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. ఆ సందర్భంగా ఇరువురూ ఆలింగనం చేసుకున్నారు. ప్రకాశ్ రాజ్ మోహన్ బాబు ఆశీస్సులు తీసుకున్నారు.
- - - - - - - - - Advertisement - - - - - - - - -