తమిళ దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన సినిమా 'లవ్ టుడే'. ఈ సినిమా తమిళ్ బాక్స్ ఆఫీసు వద్ద సూపర్ డూపర్ హిట్ గా నిలిచి 50 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ కామెడీ ఎంటర్టైనర్ సినిమా హౌస్ ఫుల్ బోర్డ్ లతో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. అందుకే ఈ సినిమాను తెలుగు లో అదే టైటిల్‌తో విడుదల చేయాలని నిర్ణయించారు ప్రముఖ నిర్మాత దిల్ రాజు. వాస్తవానికి ఈ సినిమా తెలుగు ట్రైలర్ మంగళవారమే రావాల్సి ఉంది. కానీ సూపర్ స్టార్ కృష్ణ మృతితో వాయిదా పడింది. అందుకే ఈ రోజు (గురువారం) ఈ ట్రైలర్ ను టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా మూవీ టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు విజయ్.
ట్రైలర్ చూస్తుంటే సినిమాలో కొంచెం కొత్తదనం కనిపిస్తుంది. ఒక ఇంట్రెస్టింగ్ సబ్జెక్టుతో కామెడీని మిక్స్ చేసి సరదాగా సాగిపోయేలా తీశారు దర్శకుడు ప్రదీప్. ఇక ట్రైలర్ లోకి వెళ్తే.. హీరో ఉత్తమన్ ప్రదీప్, నికిత ప్రేమించుకుంటారు. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. ప్రదీప్ ఇంట్లో పెద్దగా సమస్యలేకపోవడంతో నికిత తండ్రిని ఒప్పించడానికి వాళ్ళ ఇంటికి వెళ్తాడు ప్రదీప్. అయితే నికిత తండ్రి సత్యరాజ్ వీరి ప్రేమ పెళ్లికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్తాడు. కానీ పెళ్లికి ఒప్పుకోవాలి అంటే ఒక కండిషన్ ను పెడతాడు. అదేంటంటే.. ఒకరోజు ఇద్దరూ తమ స్మార్ట్ ఫోన్ లు మార్చుకోవాలని చెప్తాడు సత్యరాజ్.
దీంతో ప్రదీప్ నికిత తమ తమ స్మార్ట్ ఫోన్ లను మార్చుకుంటారు. ఇక్కడే సినిమా అసలు కథ మొదలవుతుంది. ఫోన్ కు మార్చుకున్న తర్వాత ప్రదీప్, నికిత తమ రహస్యాలు బయటికి వస్తాయనే ఆందోళన మొదలవుతుంది. తర్వాత వారు ఒకరి ఫోన్ ను మరొకరు చెక్ చేసుకోవాలని అనుకుంటారు. ఫోన్ లు అన్ లాక్ చేసిన తర్వాత ఒకరి గురించి ఒకరు ఏం తెలుసుకున్నారు ? ఎవరికి ఎలాంటి హిస్టరీ ఉంది ? తర్వాత ఏమవుతుంది ? చివరికి వాళ్లిద్దరూ పెళ్లి చేసుకుంటారా లేదా విడిపోతారా ? అనే ప్రశ్నలకు సమాధానాలు దొరకాలంటే సినిమా విడుదల వరకూ ఆగాల్సిందే. సినిమా ప్రస్తుత సమాజాన్ని ప్రభావితం చేసేలా ఉండటంతో మూవీపై ఆసక్తి నెలకొంది.
ఈ సినిమాకు ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించడమే కాకుండా ప్రధాన పాత్రలో నటించారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న ఈ మూవీలో ఇవానా హీరోయిన్ గా కనిపించనుంది. యువన్ శంకర్ రాజా స్వరాలందిస్తున్నారు. సినిమాలో సత్యరాజ్, యోగి బాబు, రాధికా శరత్‌కుమార్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాను నవంబర్ లోనే విడుదల చేయాలని అనుకున్నారు నిర్మాత దిల్ రాజు. అయితే హీరో గురించి తెలుగులో పెద్దగా పరిచయం లేకపోవడంతో ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా విడుదలకు కొన్ని రోజులు గ్యాప్ తీసుకోవాలని అనుకుంటున్నారట. మరి ముందుగా అనుకున్నట్టుగా నవంబర్ లో విడుదల చేస్తారా లేదా వాయిదా వేస్తారా అనేది త్వరలోనే వెల్లడించనున్నారు మూవీ టీమ్. మొత్తంగా ఈ 'లవ్ టుడే' తెలుగు ట్రైలర్ ఆకట్టుకునే విధంగా ఉండటంతో మూవీ పై అంచనాలు పెరిగాయి.
Also Read : 'అహ నా పెళ్ళంట' వెబ్ సిరీస్ రివ్యూ : రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్‌ల కామెడీ, రొమాన్స్ ఎలా ఉందంటే?