మన దేశ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే గాయని.. లతా మంగేష్కర్. ఆమె పాటల రికార్డును బద్దలకొట్టడం ఇప్పట్లో ఎవరికీ సాధ్యం కాకపోవచ్చేమో. లతా మంగేష్కర్ 13 ఏళ్ల వయస్సులోనే కెరీర్‌ను ప్రారంభించారు. 1942లో ‘నాచు యా గదే’ అనే మరాఠీ పాటతో ఆమె సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. బాలీవుడ్‌లో తిరుగులేని గాయనిగా దూసుకెళ్లారు. దేశంలోని దాదాపు అన్ని భాషల్లో ఆమె పాటలు పాడారు. ఆమె కెరీర్ సాఫీగా సాగుతున్న సమయంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది.
1962లో లతా మంగేష్కర్‌కు ఎవరో స్లో పాయిజన్ ఇచ్చారు. దీంతో ఆమె దాదాపు చావును చూసి వచ్చారు. మూడు రోజులపాటు ఆమె నరకాన్ని చూశారు. సుమారు మూడు నెలల బెడ్ రెస్ట్ తర్వాతే ఆమె పూర్తిగా కోలుకున్నారు. ఆ తర్వాత ఆమె పాడలేదని, ఇక కెరీర్ ముగిసిందని అనుకున్నారు. కానీ, ఆమె పట్టుదల ముందు.. అనారోగ్యం కూడా తలవంచింది. ప్రతికూల పరిస్థితులను దాటి ఆమె మరోసారి తన ‘పాట’కు ప్రాణం పోశారు.
ఈ ఘటనపై లతా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘1962లో నేను చాలా అనారోగ్యానికి గురయ్యాను. సుమారు మూడు నెలలు కోలుకోలేకపోయాను. ఇక జీవితంలో మరెప్పుడూ పాడలేను అనుకున్నాను. నా కడుపులో చాలా అసౌకర్యంగా ఉండేది. నన్ను ఎవరో గట్టిగా నెట్టేస్తున్నట్లు అనిపించేది. వాంతులు పచ్చ రంగులో వచ్చేవి. నేను అస్సలు కదల్లేని పరిస్థితిలో ఉండటంతో డాక్టర్లు ఇంట్లోనే ఎక్స్‌రే మెషిన్ పెట్టి మరీ ఎప్పటికప్పుడు నా ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొనేవాళ్లు. అయితే, అప్పటివరకు నాకు ఆరోగ్యం బాగోలేదనే అనుకొనేదాన్ని. కానీ, డాక్టర్లు నాపై విషప్రయోగం జరిగిందని చెప్పారు’’ అని తెలిపారు.
ప్రముఖ రచయిత, లతా సన్నిహితురాలు పద్మ సచ్‌దేవ్ రాసిన పుస్తకంలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. స్లో పాయిజన్‌తో ఎవరో ఆమెను చంపాలని చూశారని తెలిపారు. ‘‘అప్పట్లో ఆమెకు సుమారు 33 ఏళ్లు ఉంటాయి. పొత్తికడుపులో తీవ్రమైన నొప్పితో బాధపడ్డారు. నొప్పి వల్ల ఆమె కదల్లేకపోయేవారు. శరీరమంతా నొప్పులే. లతా అనారోగ్యానికి గురైన తర్వాత ఆమె వంట మనిషి కనిపించకుండా పోయింది. కనీసం నెల జీతం కూడా తీసుకోకుండా ఆమె మాయమైంది’’ అని తెలిపారు. అయితే, ఆమెతో ఎవరు ఆ పనిచేయించారేనేది ఇప్పటికీ మిస్టరీనే. ఈ ఘటన తర్వాత బాలీవుడ్ ప్రముఖ పాటల రచయిత మజ్రూమ్ సుల్తాన్‌పూరీ లతా ఇంటికి వెళ్లేవారు. ఆహారాన్ని ముందు ఆయనే తినేవారు. అది సేఫ్ అని తెలిసిన తర్వాత లతాకు పెట్టేవారు. అంతేకాదు.. అందమైన పద్యాలు, జోకులు చెబుతూ.. లతా త్వరగా కోలుకొనేందుకు సహకరించారు.