బెల్లంకొండ గణేష్ (Bellamkonda Ganesh) ను కథానాయకుడిగా పరిచయం చేస్తూ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న సినిమా 'స్వాతి ముత్యం' (Swathi Muthyam 2022). వర్ష బొల్లమ్మ హీరోయిన్. అక్టోబర్ 5న సినిమా విడుదలవుతోంది. ఈ సందర్భంగా లక్ష్మణ్ కె. కృష్ణ మీడియాతో సమావేశం అయ్యారు. ఆయన ఇంటర్వ్యూ ఇది!
మీ నేపథ్యం ఏమిటి?
మాది తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం. చిన్నతనం నుంచి సినిమాలు అంటే ఆసక్తి. స్కూల్ చదివేటప్పుడు డ్రామాలు రాసేవాడిని. ఊరిలో పెళ్లిళ్లకు వీడియోలు తీసేవాళ్లను టీమ్‌గా ఏర్పాటు చేసుకుని షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళం. మా స్నేహితుడికి శ్రీకాంత్ అడ్డాల దగ్గర అవకాశం రావడంతో నేనూ వచ్చేశా. అవకాశాల కోసం ప్రయత్నించా. కానీ, రాలేదు. అప్పుడు మళ్ళీ షార్ట్ ఫిల్మ్స్ చేశా. 'లాస్ట్ విష్', ఆ తర్వాత 'కృష్ణమూర్తి గారింట్లో' చేశా. వాటికి మంచి ఆదరణ రావడంతో సైమా షార్ట్ ఫిల్మ్స్ అవార్డుల్లో ఉత్తమ దర్శకుడిగా అవార్డు వచ్చింది. సైమా వాళ్ళు ఒక సినిమా ప్రొడ్యూస్ చేస్తామన్నారు. కానీ, కుదరలేదు. ఆ తర్వాత ఇండిపెండెంట్ ఫిల్మ్ 'సదా నీ ప్రేమలో' చేశాం. అప్పటి వరకు ప్రేమకథలు చేశా. ఆ తర్వాత ఫ్యామిలీ సినిమా చేయాలని 'స్వాతి ముత్యం' స్టోరీ రాసుకున్నా.
'స్వాతి ముత్యం' కథ రాశాక... ముందు హీరోను సంప్రదించారా? లేదంటే నిర్మాతలను సంప్రదించారా?
స్నేహితుడి ద్వారా బెల్లంకొండ గణేష్‌ను కలిశా. 'స్వాతి ముత్యం' కథ కాకుండా వేర్వేరు లైన్స్ చెప్పాను. వాళ్ళన్నయ్య సాయి శ్రీనివాస తరహాలో కమర్షియల్ సినిమా చేస్తారనుకున్నాను. అయితే... ఆయన సింపుల్ కథ అడిగారు. అప్పుడు 'స్వాతి ముత్యం' చెప్పాను. ఆ తర్వాత బెల్లంకొండ సురేష్ గారికి చెప్పాను. అక్కడ నుంచి సితారకు వచ్చాను.
సినిమా కథేంటి?
హీరో పేరు బాల మురళీకృష్ణ. ఇంజనీరింగ్ పూర్తి చేశాక... ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది. చిన్న టౌన్‌లో జూనియర్ ఇంజనీర్‌గా చేరతాడు. దాంతో అతడికి పెళ్లి సంబంధాలు చూడటం స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత ఏమైంది? అనేది కథ. సాధారణ పెళ్లిలో ఎన్ని కష్టాలు ఉంటాయనేది ఆసక్తికరంగా తెరకెక్కించాం. సినిమాలో విలన్ ఎవరూ ఉండరు. పరిస్థితులే విలన్ అన్నమాట.
హిందీ సినిమాకు రీమేకా? లేదంటే ఈ సినిమాకు స్ఫూర్తి ఏమిటి?
ఒరిజినల్ కథతో సినిమా తెరకెక్కించాం. గోదావరి జిల్లాల్లోని పట్టణాలలో కొంత మంది టీజర్ జాబ్స్ చేస్తారు. అలాగే, చుట్టుపక్కల వాళ్ళు వచ్చి మన మీద సెటైర్లు వేస్తారు. నా జీవితంలో జరిగిన సంఘటనల స్ఫూర్తితో కథ రాసుకుని, సినిమా తీశా.
'స్వాతి ముత్యం' - క్లాసిక్ సినిమా టైటిల్. మీ సినిమాకు ఆ టైటిల్ పెట్టే సాహసం ఎందుకు చేశారు?
కథ విన్నాక... మా నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) గారికి ఇన్నోసెంట్ క్యారెక్టర్లు చాలా ఉన్నాయి. అందుకని, 'స్వాతి ముత్యం' టైటిల్ పెడదామన్నారు. అంతకు ముందు వేరే టైటిల్స్ అనుకున్నాం. 'స్వాతి ముత్యం' అనగానే కొంచెం భయం వేసింది. ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకున్నారోనని భయపడ్డా. అయితే... టీజర్, ట్రైలర్ వంటివి ముందు విడుదల చేస్తాం కాబట్టి ఆ సినిమాతో పోలిక రాదని చినబాబు గారు సపోర్ట్ చేయడంతో ముందు వెళ్లాం.
హీరోగా గణేష్ తొలి చిత్రమిది. ఆయన ఎలా చేస్తారోనని భయపడ్డారా?
నాకూ ఇది తొలి చిత్రమే కదండీ. నా కథ నచ్చినా నేను ఎలా తీస్తాననో ఆయనలో సందేహాలు ఉండి ఉండొచ్చు కదా! దర్శకుడిగా నేను, హీరోగా అతను సక్సెస్ అవ్వాలని కష్టపడి తీశాం. కథా చర్చల కోసం మేం చాలా రోజులు ట్రావెల్ చేశాం. ఒకరి మీద మరొకరికి కాన్ఫిడెన్స్ వచ్చాక... షూటింగ్ స్టార్ట్ అయ్యింది. అందువల్ల, ఎలాంటి ఇబ్బందులు రాలేదు.
కథానాయికగా వర్ష బొల్లమ్మ ఎంపిక ఎవరిది?
'96'లో ఆ అమ్మాయి నటన నచ్చింది. ఆమెను ఊహించుకుని కథానాయిక పాత్ర రాశా. గణేష్, సితార సంస్థలో కథ ఓకే అయ్యాక... ఇతర అమ్మాయిల పేర్లు పరిశీలనలోకి వచ్చాయి. ఆ సమయంలో 'మిడిల్ క్లాస్ మెలోడీస్' విడుదల కావడం, ఆమె పేరుకు మా టీమ్ ఓకే చెప్పడం చకచకా జరిగాయి.
Also Read : చిరంజీవితో వస్తున్నాం కానీ ఆయనకు పోటీగా కాదు
దర్శకత్వంలో మీకు స్ఫూర్తి?
మణిరత్నం, తెలుగులో పెద్ద వంశీ, బాపు, జంధ్యాల గారు. హీరోల్లో చిరంజీవి గారు నా ఫేవరెట్.
దర్శకుడిగా మీ తదుపరి సినిమా సితారలో ఉంటుందా?
అగ్రిమెంట్స్ లాంటివి ఏం లేవు. అయితే... మళ్ళీ సితారలో చేసే అవకాశం ఉంది. ఈసారి కామెడీ థ్రిల్లర్ లేదంటే సీరియస్ డ్రామా చేయాలనుంది.
Also Read : 'ఆదిపురుష్' ట్రెండ్ సెట్టర్ - నేను ప్రభాస్ వీరాభిమాని : సోనాల్ చౌహన్ ఇంటర్వ్యూ