ప్రముఖ దర్శకుడు కృష్మవంశీ 'రంగమార్తాండ' అనే సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. మరాఠీలో విడుదలైన 'నట సామ్రాట్' సినిమాకి ఇది రీమేక్. సాధారణంగా అయితే దర్శకుడు కృష్ణవంశీ రీమేక్ సినిమాపై పెద్దగా ఆసక్తి చూపరు. సొంత కథలతోనే సినిమాలను రూపొందిస్తారు. కానీ 'నట సామ్రాట్' సినిమాను చూసిన ఆయన రీమేక్ చేయాలని ఫిక్సయిపోయారు. అంతగా అతడిని కదిలించిన సినిమా అది. 


చాలా కాలంగా ఫ్లాప్ లతో డీలా పడ్డ వంశీ ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నారు. 'నట సామ్రాట్' సినిమాలో నానా పటేకర్ ప్రధాన పాత్ర పోషించారు. ఆయన పాత్రను తెలుగులో ప్రకాష్ రాజ్ పోషిస్తున్నారు. అలానే సినిమాలో మరో ముఖ్య పాత్ర ఒకటి ఉంటుంది. నానా పటేకర్ స్నేహితుడిగా మరాఠీలో విక్రమ్ గోఖలే నటించారు. సీరియస్ గా ఎమోషనల్ గా సాగే ఆ పాత్ర కోసం బ్రహ్మానందాన్ని ఎంపిక చేశారు. 


ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. నిజానికి ఈపాటికే సినిమా రిలీజ్ కావాల్సింది కానీ ఆలస్యం జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత పలు ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెడుతున్నారు కృష్ణవంశీ. ఇప్పటికే 'అన్నం' అనే సినిమాను ప్రకటించారు. ఫుడ్ మాఫియా నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుంది. దీంతో పాటు ఓ ఫిమేల్ సెంట్రిక్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. 


ఈ సినిమా తీయాలని చాలా కాలంగా అనుకుంటున్నారు కృష్ణవంశీ. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ ను స్ట్రీమ్ లైన్ చేశారట. ఈ సినిమాలో పూజా హెగ్డే, రకుల్ ప్రీత్ సింగ్ లను హీరోయిన్లుగా తీసుకోబోతున్నారు. దీన్ని పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కించాలనేది కృష్ణవంశీ ఆలోచన. పూజా, రకుల్ ఇద్దరికీ పాన్ ఇండియా లెవెల్ లో ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఇద్దరూ బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు వీరిద్దరినీ ప్రాజెక్ట్ లోకి తీసుకొచ్చి పాన్ ఇండియా సినిమాగా అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ రానుంది. 


కృష్ణవంశీ ఓటీటీ ప్రాజెక్ట్:


పాండమిక్ సమయంలో జనాలు ఓటీటీకి బాగా అలవాటు పడ్డారు. ఇప్పుడు చాలా మంది థియేటర్లకు వెళ్లి సినిమా చూడడానికి కూడా పెద్దగా ఇష్టపడడం లేదు. ఓటీటీలోనే చూసుకుంటున్నారు. ఇక వెబ్ సిరీస్ లైతే వందల సంఖ్యలో రిలీజ్ అవుతున్నాయి. ఒరిజినల్ కంటెంట్ కోసం బాగా ఖర్చు చేస్తున్నాయి ఓటీటీ సంస్థలు. తెలుగులో కూడా పదుల సంఖ్యలో వెబ్ సిరీస్ లు వస్తున్నాయి. వీటికోసం కోట్లలో ఖర్చు చేస్తున్నారు. పేరున్న దర్శకులు చాలా మంది ఓటీటీ ప్రాజెక్ట్స్ చేపడుతున్నారు. 






ఇప్పుడు కృష్ణవంశీ వంతు వచ్చింది. త్వరలోనే ఆయన ఓటీటీ ప్రాజెక్ట్ చేయబోతున్నారట. ఈ ప్రాజెక్ట్ బడ్జెట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. అక్షరాల రూ.300 కోట్ల వరకు ఉంటుంది. ఇదొక బ్లాస్ట్ లాంటి ప్రాజెక్ట్ అని.. త్వరలోనే వివరాలు చెబుతానని అన్నారట. కృష్ణవంశీ లాంటి డైరెక్టర్ ని నమ్మి మూడొందల కోట్ల బడ్జెట్ పెట్టడమంటే మాములు విషయం కాదు. కాకపోతే ఓటీటీలతో ఏదైనా సాధ్యమనే చెప్పాలి. అక్కడ బడ్జెట్ లిమిటేషన్స్ ఉండవు. ప్రాజెక్ట్ పై నమ్మకం ఉంటే ఎంతైనా పెట్టొచ్చు. నెట్ ఫ్లిక్స్ లాంటి సంస్థలకు మూడొందల కోట్లు పెద్ద మేటర్ కూడా కాదు.