ఆనంద్ రవి (Anand Ravi) కథ, కథనం, మాటలు అందించడంతో పాటు హీరోగా నటించిన చిత్రం 'కోరమీను' (Korameenu Movie). 'మీసాల రాజు గారికి మీసాలు తీసేశారంట! ఎందుకు?' - అంటూ ఓ పోస్టర్ విడుదల చేసి సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించారు. ఆ తర్వాత విడుదల చేసిన టీజర్, సాంగ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. తాజా సమాచారం ఏంటంటే... ఈ నెలలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. 


డిసెంబర్ 15న 'కోరమీను'
Korameenu Movie Release Date : డిసెంబర్ 15న 'కోరమీను' చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు ఈ రోజు ఆనంద్ రవి వెల్లడించారు. దాంతో ఆయన ధైర్యం ఏమిటి? అని ఇండస్ట్రీ డిస్కషన్ చేస్తోంది. డిసెంబర్ 15న 'అవతార్ 2' (Avatar The Way Of Water) విడుదల అవుతోంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ అని తేడాలు లేకుండా ఇండియాలో అన్ని భాషల ప్రేక్షకులు ఆ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. భారీ సినిమాతో పాటు తన సినిమాను ఆనంద్ రవి విడుదల చేయాలని అనుకోవడం సాహసమే.


'శంకర్‌దాదా ఎంబిబిఎస్', 'ఆనంద్' - రెండూ ఒకే రోజు విడుదల కావడమే కాదు... రెండూ విజయాలు సాధించాయి. తన అభిమాన కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాతో పాటు తన సినిమా కూడా విజయం సాధించడం సంతోషంగా ఉందని శేఖర్ కమ్ముల సంతోషం వ్యక్తం చేశారు. ఈ విధమైన సందర్భాలు కొన్ని ఉన్నాయి. 'అవతార్ 2'తో పాటు 'కోరమీను' విజయం సాధించవచ్చు. సినిమాలో కంటెంట్ ఉంటే హిట్ గ్యారెంటీ. 


ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శ్రీపతి కర్రి దర్శకత్వంలో పెళ్లకూరు సమన్య రెడ్డి 'కోరమీను' చిత్రాన్ని నిర్మించారు. ఎ స్టోరి ఆఫ్ ఇగోస్... అనేది ఉపశీర్షిక. ఆల్రెడీ విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. 






Korameenu Teaser Review : టీజర్ చూస్తే నటుడు శత్రు మీసాల రాజు అనేది ఈజీగా అర్థమవుతుంది. జాలరి పేటకు కొత్తగా పోలీస్ రావడం, జాయిన్ అయిన రోజున ఆయన మీసాలను ఎవరో తీసేయడం, ఆ కోపంతో రగిలే ఆయన తన మీసాలు ఎవరు తీశారో తెలుసుకోవడం కోసం ప్రయత్నించడం... కథలో కీలకమైన అంశం అని తెలుస్తోంది. 


'డబ్బుకు ఎక్కువ పవర్ అనుకుంటారు గానీ... అసలైన పవర్ భయానిదే రా' అని హరీష్ ఉత్తమన్ (Harish Uthaman) నోటి నుంచి వచ్చే మాట... ఆయన పాత్ర ఏమిటన్నది చెప్పకనే చెప్పింది. 'ఇది జాలరి పేట... డబ్బున్నోడు, డబ్బు లేనోడు అంతే!' అని హీరోయిన్ కిషోరీతో ఆనంద్ రవి మాట చెబుతారు. డబ్బున్న వాళ్ళది రాజ్యమనే మీనింగ్ అందులో వినబడుతోంది.


Also Read : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' సినిమా ఎలా ఉందంటే?


కోటి పాత్రలో ఆనంద్ రవి, కరుణగా హరీష్ ఉత్తమన్, మీసాల రాజు పాత్రలో శత్రు, మీనాక్షిగా కిషోరీ దత్రక్,దేవుడు పాత్రలో రాజా రవీంద్ర, సీఐ కృష్ణ పాత్రలో గిరిధర్, ముత్యంగా 'జబర్దస్త్' ఇమ్మాన్యుయెల్, సుజాతగా ఇందు కుసుమ, వీరభద్రమ్ పాత్రలో ప్రసన్న కుమార్, కరుణ అసిస్టెంట్ పాత్రలో ఆర్కే నాయుడు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : కార్తీక్ కొప్పెర, నేపథ్య సంగీతం : సిద్ధార్థ్ సదాశివుని, నిర్మాణ సంస్థ : ఫుల్ బాటిల్ ఎంటర్‌టైన్‌మెంట్స్, కథ - కథనం - మాటలు : ఆనంద్ రవి, దర్శకత్వం : శ్రీపతి కర్రి, నిర్మాత : పెళ్లకూరు సమన్య రెడ్డి.