మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సౌతిండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో హీరో సివిల్ సర్వెంట్ అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. సినిమా ఓపెనింగులో హీరో హీరోయిన్లతో పాటు మెయిన్ ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులకు సూటు బూటు వేసి మెట్లు ఎక్కుతున్నట్టు చూపిస్తూ... సినిమా థీమ్ తెలిసేలా ఓ స్టిల్ విడుదల చేశారు. సినిమాలో ఓ కీలక సన్నివేశం అలా ఉంటుందని సంగీత దర్శకుడు తమన్ కూడా చెప్పారు.

 

మీడియాలో పనిచేసే కథానాయకుడు ముఖ్యమంత్రి అయితే? అనే కథాంశంతో 'ఓకే ఒక్కడు' సినిమా తీశారు శంకర్. ఈసారి సివిల్ సర్వెంట్ ముఖ్యమంత్రి అయితే? అనే కథాంశంతో రామ్ చరణ్ సినిమా తీస్తున్నారని ప్రచారం జరుగుతోంది. దాన్ని పక్కన పెడితే... ఈ సినిమా కథ తనదేనని కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ తెలిపారు.

 

విక్రమ్, ఆయన తనయుడు ధృవ్ విక్రమ్ హీరోలుగా తెరకెక్కించిన 'మహాన్' విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రామ్ చరణ్ 15వ సినిమా కథ తనదేనని.... స్క్రీన్ ప్లే, డైలాగ్స్ శంకర్ అండ్ టీమ్ రాస్తున్నారని కార్తీక్ సుబ్బరాజ్ (Karthik Subbaraj) చెప్పారు. లాక్‌డౌన్‌లో జూమ్ కాల్స్‌లో ద‌ర్శ‌కులు అంద‌రూ మాట్లాడుకుంటుండగా కథ ఐడియా వస్తే చెప్పానని శంకర్ ఓకే చేశారని కార్తీక్ అన్నాడు. 'మహాన్' షూటింగులో ఉండటం వల్ల స్క్రీన్ ప్లే  అందించలేకపోయానని చెప్పారు. ఇదొక పొలిటికల్ థ్రిల్లర్ అని కార్తీక్ సుబ్బరాజ్ కన్ఫర్మ్ చేశారు.

 

రామ్ చరణ్ సరసన కియారా అడ్వాణీ (Kiara Advani) కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. హీరోగా రామ్ చరణ్ 15వ సినిమా ఇది (RC15). శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ పతాకంపై 'దిల్‌' రాజు, శిరీశ్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 50వ చిత్రం ఇది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని అనుకుంటున్నారు.