మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ కీలక నిర్ణయం తీసుకుంది.  నిర్ణీత రుసుము చెల్లించని అన్ని అకౌంట్లకు సంబంధించిన బ్లూ టిక్ లను తొలగించింది. బ్లూ టిక్ కోల్పోయిన వారిలో  సినీ సెలబ్రిటీలు, స్టార్ క్రికెటర్లు, రాజకీయ నేతలు ఉన్నారు. తెలుగు సినిమా పరిశ్రమలో చాలా మంది నటీనటుల వెరిఫైడ్ టిక్ తొలగించింది ట్విట్టర్.


బ్లూ టిక్ కోల్పోయిన తెలుగు స్టార్స్ వీళ్లే!


బ్లూటిక్ కోల్పోయిన తెలుగు సినీ నటీనటులలో సీనియర్ నటుల నుంచి కొత్త తారల వరకు ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్,  అల్లు అర్జున్,వెంకటేష్, అక్కినేని నాగచైతన్య, అఖిల్ అక్కినేని, నితిన్, ప్రకాష్ రాజ్, మంచు మనోజ్ అకౌంట్స్ కు బ్లూ టిక్ తొలగించింది. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే పూజా హెగ్డే, కీర్తి సురేష్, సమంత, రకుల్ ప్రీత్ సింగ్, మంచు లక్ష్మి సహా పలువురు అకౌంట్లు బ్లూ టిక్ కోల్పోయాయి.  అయితే, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, అక్కినేని నాగార్జున, మంచు విష్ణు బ్లూ టిక్‌లు అలాగే ఉన్నాయి. అయితే వీరంతా ట్విట్టర్ బ్లూ టిక్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొని ఉంటారని తెలుస్తోంది. అటు బ్లూటిక్ కోల్పోవడంపై ప్రకాష్ రాజ్ స్పందించారు. ‘బై బై బ్లూ టిక్’ అని ట్వీట్ చేశారు.






అప్పట్లో బ్లూ టిక్ ఫ్రీ


ట్విట్టర్ లో పర్సనల్ అకౌంట్స్ కు, కంపెనీ అకౌంట్స్ కు వెరిఫైడ్ బ్లూ టిక్ లు సాధారణంగా ఉండేవి. తమ అకౌంట్స్ ను వెరిఫై చేసుకుని ఉచితంగా బ్లూటిక్ పెట్టుకునే అవకాశం ఉండేది. కానీ, ఎలన్ మస్క్ ట్విట్టర్ ను చేజిక్కించుకున్న తర్వాత,  వెరిఫైడ్ బ్లూ టిక్ లకు నిర్ణీత రుసుము చెల్లించాలనే నింబంధన పెట్టారు.  బ్లూ టిక్ కావాలనుకునే అకౌంట్ హోల్డర్స్, 8 నుంచి 11 అమెరికన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. అలా చెల్లించని అకౌంట్లకు తాజాగా బ్లూ టిక్ తొలగించింది.  


మార్చిలో కీలక నిర్ణయాన్ని ప్రకటించిన మస్క్


వెరిఫైడ్ టిక్ కోసం నిర్ణీత రుసుము చెల్లించాల్సి ఉంటుందని మార్చిలో ట్విట్టర్ వెల్లడించింది. "ఏప్రిల్ 1న, మేము మా లెగసీ వెరిఫైడ్ ప్రోగ్రామ్‌ను క్లోజ్ చేస్తాం.  లెగసీ వెరిఫైడ్ చెక్‌ మార్క్‌ లను తీసివేయడం ప్రారంభిస్తాము. Twitterలో మీ బ్లూ చెక్‌ మార్క్ ఉంచడానికి నిర్ణీతర రుసుము చెల్లించాల్సి ఉంటుంది” అని వెల్లడించింది.


మోసాలకు చెక్ పెట్టేందుకు బ్లూ టిక్


సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, కంపెనీలు, బ్రాండ్‌లు, వార్తా సంస్థలు, ఇతర  ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన అకౌంట్స్ కు సంబంధించి మోసాలు జరగకుండా వినియోగదారులను అలర్ట్ చేయడానికి  ట్విట్టర్ బ్లూ టిక్ ను అందుబాటులోకి తెచ్చింది. Twitter మొట్టమొదట 2009లో బ్లూ చెక్ మార్క్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఉచితంగానే ధృవీకరణ పొంది బ్లూటిక్ సాధించే అవకాశం ఉండేది. అయితే, మస్క్ ట్విట్టర్ ను కొనుగోలు చేసిన తర్వాత కీలక నిర్ణయం తీసుకున్నారు.  గత సంవత్సరం కంపెనీ టేకోవర్ అయిన రెండు వారాల్లోనే ప్రీమియం పెర్క్‌ లలో ఒకటిగా చెక్-మార్క్ బ్యాడ్జ్‌ తో ట్విట్టర్ బ్లూను ప్రారంభించింది. బ్లూ టిక్ లకు రుసుము విధించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని మస్క్ భావిస్తున్నారు.


Read Also: వామ్మో, శంకర్ ప్లాన్ మామూలుగా లేదుగా, ‘గేమ్ ఛేంజర్’లో కనీవినీ ఎరుగని ఫైట్ సీన్