టాలీవుడ్ లో హీరోయిన్ గా, సపోర్టింగ్ రోల్స్ లో కొన్ని సినిమాలు చేసింది మధుశాలిని. ఈ తెలుగమ్మాయికి అనుకున్న స్థాయిలో అవకాశాలు రాకపోవడంతో కోలీవుడ్ కి వెళ్లిపోయింది. అక్కడే కొన్ని సినిమాల్లో నటించింది. చాలా కాలం తరువాత తెలుగులో 'గూఢచారి' అనే సినిమాలో నటించింది. ఇందులో ఆమె క్యారెక్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా '9 అవర్స్' వెబ్ సిరీస్ లో కనిపించింది ఈ బ్యూటీ. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఈ బ్యూటీ గోకుల్ ఆనంద్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది.
తమిళ ప్రేక్షకులకు అతడు సుపరిచితుడే అయినప్పటికీ.. తెలుగు వాళ్లకు మాత్రం పెద్దగా పరిచయం లేదు. గోకుల్ ఆనంద్ మళయాలంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలుపెట్టారు. ఆయన నటించిన టీవీ షోలు మలయాళ ఛానెల్స్ లో ప్రసారమయ్యాయి. 14 ఏళ్ల వయసులో రామాయణం తమిళ వెర్షన్ కి సంబంధించిన నాటకంలో నటించారు గోకుల్ ఆనంద్. ఆ తర్వాత రెండేళ్లకు 'ఏవం' అనే ఫేమస్ థియేటర్ గ్రూప్ లో చేరారాయన. అక్కడే రెండేళ్లపాటు శిక్షణ తీసుకున్నారు.
2008లో చెన్నైలో 'The Boardwalkers' అనే థియేటర్ కంపెనీతో కలిసి పని చేశారు. యాక్టర్ అవ్వాలనే కోరికతో బీఏలో యాక్టింగ్ కోర్స్ చేశారు. ఆ తరువాత ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నించారు. ఎన్నో ఆడిషన్స్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలో అతడికి మ్యూజిక్ డైరెక్టర్ గిబ్రాన్ తో పరిచయం ఏర్పడింది.
అతడి ద్వారా 'చెన్నై టు సింగపూర్' అనే సినిమాలో లీడ్ రోల్ లో అవకాశం సంపాదించుకున్నారు. ఈ సినిమా పెద్దగా ఆడనప్పటికీ.. హీరోగా గోకుల్ ఆనంద్ కి మంచి పేరొచ్చింది. అతడి లుక్స్ కి, స్క్రీన్ ప్రెజన్స్ కి మంచి మార్కులే పడ్డాయి. ఆ తరువాత 'పంచాక్షరం', 'తిట్టమ్ ఇరండు', 'నడువన్' వంటి సినిమాల్లో నటించారు. నటుడిగా అతడికి బ్రేక్ ఇచ్చిన సినిమాలైతే లేవు. కానీ ఇప్పటికీ కూడా ఒకట్రెండు అవకాశాలు దక్కించుకుంటూనే ఉన్నారు. 'పంచాక్షరం' సినిమా సమయంలో మధు షాలినితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి ఆమెని పెళ్లి చేసుకున్నారు గోకుల్ ఆనంద్. ప్రస్తుతం ఆయన మలయాళంలో 'జాక్ అండ్ జిల్' అనే సినిమాలో నటిస్తున్నారు.